మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం... రేవంత్ సీరియస్ వ్యాఖ్యలు!
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.;
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... పరిశ్రమ ప్రమాద స్థలిని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు.
అవును... పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా... మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభత్వం అండగా ఉంటుందని పేర్కొన్న ముఖ్యమంత్రి... బాధితుల పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్ లో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిశ్రమలకు స్పష్టమైన సూచనలు ఇస్తామని తెలిపారు.
ఇదే క్రమంలో... తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇప్పిస్తామని చెప్పిన సీఎం... పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా... భద్రతపై కంపెనీ యాజమాన్యాలు కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
ఘటనపై సీఎం సీరియస్!:
ప్రమాద స్థలిని పరిక్శీలించిన అనంతరం పరిశ్రమలశాఖ అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో పరిశ్రమల శాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? అని అడిగారు.
ఇదే సమయంలో... వాటి పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని అధికారులను ప్రశ్నించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా... ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దంటూ సీరియస్ అయిన సీఎం... ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇదే క్రమంలో... కార్మికులకు బీమా సదుపాయం ఉందా లేదా అని ఆరాతీసిన సీఎం... సిగాచీ పరిశ్రమకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని .. అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాని స్పష్టం చేశారు.