ఆ మాజీ మంత్రికి టీడీపీ గేట్లు ఓపెన్ ?

ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన శిద్ధా రాఘవరావు వైసీపీకి దూరం అయ్యారు. ఆయన తెలుగుదేశంతో తన పూర్వ బంధాన్ని కొనసాగించే ప్రయత్నాలు మొదలెట్టారు.;

Update: 2026-01-06 03:00 GMT

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కొందరు మాజీ మంత్రులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. వారు తమ ప్రయత్నాలలో తాము ఉన్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు ఒకరు. ఆయన టీడీపీలోనే తన రాజకీయాన్ని ప్రారంభించి కొనసాగించారు అని చెప్పాలి. 2014లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చారు. ఆ వెంటనే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చి సమాదరించారు. అలా అయిదేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగిన సిద్ధా రాఘవరావుకు 2019లో దర్శి టికెట్ దక్కలేదు. ఆయనను ఎంపీగా పోటీ చేయించారు. అలా ఓటమి చెందిన తరువాత ఆయన వైసీపీలోకి చేరిపోయారు. వైసీపీలో 2024లో దర్శి టికెట్ కోరినా దక్కలేదు, అది బూచేపల్లి శివప్రసాదరెడ్డికి లభించింది. ఆయన ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యారు.

వైసీపీకి దూరం :

ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన శిద్ధా రాఘవరావు వైసీపీకి దూరం అయ్యారు. ఆయన తెలుగుదేశంతో తన పూర్వ బంధాన్ని కొనసాగించే ప్రయత్నాలు మొదలెట్టారు. 2024 లో విజయవాడలో భారీ వరదలు సంభవించినపుడు నేరుగా చంద్రబాబుని కలసి భారీ విరాళాన్ని కూడా ఆయనకు అందించారు. అలా బాబు గుడ్ లుక్స్ లో ఉన్న పెద్దాయన ఏదో విధంగా పచ్చ కండువా కప్పుకుని దర్శిలో తిరిగి తన హవా కొనసాగించాలని ఉబలాటపడుతున్నారు ఆర్ధికంగా బలమైన నేతగా ఉన్న ఆయన తన సేవలను సైకిల్ పార్టీకి తిరిగి అందించాలని చూస్తున్నారు. ఆ విధంగా శిద్ధా రాఘవరావు దర్శిలో తన అనుచరులను క్యాడర్ ని అలెర్ట్ చేస్తున్నారు.

సార్ వచ్చేస్తున్నారంటూ :

రేపో నేడో టీడీపీలో సార్ చేరడం ఖాయం దర్శిలో ఆయన పార్టీని నడిపించడం ఖాయమని శిద్ధా వర్గం తెగ హడావుడి చేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ జోరు పెరిగిపోవడంతో దర్శి టీడీపీ ఇంచార్జి అయిన గొట్టిపాటి లక్ష్మి వర్గీయులు దీని మీద ఫైర్ అవుతున్నారు. పార్టీని గత ఇరవై నెలలుగా నడిపిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిధులను మంజూరు చేయిస్తున్న గొట్టిపాటి లక్ష్మిదే దర్శి నియోజకవర్గం అని ఆమె అనుచరులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. దర్శి నుంచి 2029లో లక్ష్మి పోటీ చేస్తారని ఈసారి గెలిచి ఎమ్మెల్యే అవుతారని వారు అంటున్నారు. ఈ విధంగా సిద్ధా వర్సెస్ లక్ష్మి వర్గీయుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక వార్ అయితే స్టార్ట్ అయిపోయింది.

ఇంతకీ జరిగేనా :

ఇదిలా ఉంటే శిద్ధా రాఘవరావు టీడీపీలో తిరిగి చేరడం అన్నది జరిగేనా అని కూడా మరో వైపు చర్చ సాగుతోంది. దర్శిలో ఇప్పటికే గొట్టిపాటి లక్ష్మి బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతున్నారని కొత్తగా పెద్దాయనను తెచ్చి పెడితే వర్గ పోరు మొదలవుతుందేమో అన్న టాక్ కూడా నడుస్తోంది. అయితే చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల రాఘవరావు రీ ఎంట్రీ ఖాయమని ఇంకో వైపు గట్టిగా వినిపిస్తోంది. మొత్తని మీద మాజీ మంత్రికి టీడీపీ గేట్లు ఓపెన్ అయ్యాయని ప్రచారం మాత్రం దర్శిలో యమ జోరుగా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతోందో.

Tags:    

Similar News