అమరావతి.. అవకాయ్.. ఏంటీ ఫెస్టివల్!
విజయవాడ వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘అమరావతి - అవకాయ్ ఉత్సవాలు’’ ఆసక్తి రేపుతున్నాయి.;
విజయవాడ వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘అమరావతి - అవకాయ్ ఉత్సవాలు’’ ఆసక్తి రేపుతున్నాయి. సంక్రాంతి పండుగకు ముందు మూడు రోజుల పాట ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా అమరావతి - అవకాయ్ ఉత్సవాలు ఉండనున్నాయని చెబుతున్నారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా విజయవాడ పున్నమి ఘాట్, భవాని ఐలాండ్ లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఎంచుకున్న పేరే ఆసక్తి రేపుతోంది. అమరావతి, అవకాయ్ ఏంటీ స్పెషల్ అంటూ చర్చ జరుగుతోంది. దసరా సమయంలో విజయవాడ ఉత్సవ్ ను ప్రభుత్వం నిర్వహించింది. ఇది జరిగిన రెండు నెలలకే మరో పెద్ద వేడుక నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు మన భాషలోని గొప్పదనం, ఘనమైన సాహిత్యం, తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన సినిమాల గురించి ‘‘అమరావతి - అవకాయ్’’ ఉత్సవాల వేదికగా చర్చించనున్నట్లు చెబుతున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఈ ఫెస్టివల్ కు ఏర్పాట్లు చేశారు. నవలల నుంచి వెండితెర వరకు తెలుగు రచనల గుబాళింపులపై ఉద్దండులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్, డిజిటల్ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతోపాటు బుర్రకథ, కూచిపూడి నాట్యం వంటి వాటి మనుగడపైనా చర్చ జరగనుంది. వీటితోపాటు శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
8వ తేదీ ఉదయం కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాకుండా, సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రాత్మక ఘట్టంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కవిత్వం, ముషాయిరా (తెలుగు, ఉర్దూ), నృత్యం, సంగీతం, తోలుబొమ్మలాట, నాటకరంగంపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. హెరిటేజ్ వాక్ (వారసత్వ యాత్రలు), ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని చెబుతున్నారు.