భారత్ తో అమెరికా దూరమే.. వైట్ హౌస్‌లో షరీఫ్-ట్రంప్ క్లోజ్డ్ డోర్ భేటీ
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టనున్నారు.;
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన ద్వైపాక్షిక సమావేశాలకు హాజరు కానున్నారు. అనంతరం ట్రంప్ ఇచ్చే విందులో కూడా పాల్గొననున్నారు. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్ కావడంతో చర్చల అసలు వివరాలపై ఆసక్తి నెలకొంది.
ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించిన షరీఫ్, స్వదేశానికి బయలుదేరే ముందు ట్రంప్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ నుంచి నేరుగా వాషింగ్టన్ చేరుకుంటారు. అక్కడ అమెరికా అధ్యక్షుడితో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అదే సమయంలో ట్రంప్ ఎనిమిది ఇస్లామిక్-అరబ్ దేశాల నాయకులతో కూడా సమావేశమయ్యే షెడ్యూల్ ఉన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ సందర్భంగా టిక్‌టాక్ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపర్చే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్‌కు కూడా విందు ఇచ్చి, ప్రత్యేకంగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు షరీఫ్‌తో జరగబోయే ఈ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచే దిశగా అడుగుగా భావిస్తున్నారు.
ఆసియాలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఇప్పటి వరకు భారత్‌పై ఆధారపడింది. అయితే తాజాగా పరిస్థితులు మారుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తక్కువయ్యేలా ట్రంప్ కృషి చేశారని పాకిస్తాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేయాలని కూడా పాకిస్తాన్ సిద్ధత చూపింది.
అదే సమయంలో భారత్ మాత్రం ఈ ప్రతిపాదనలను ఖండించింది. పాకిస్తాన్‌తో యుద్ధం నివారణలో ట్రంప్ పాత్ర లేదని స్పష్టం చేసింది. మరోవైపు రష్యాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తున్న భారత్, అమెరికాతో కొంత దూరాన్ని పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద షెహబాజ్ షరీఫ్-ట్రంప్ సమావేశం, విందు రెండు దేశాల సంబంధాలపై మాత్రమే కాక, భారత్-అమెరికా-పాకిస్తాన్ త్రైపాక్షిక సమీకరణాలపై కూడా కొత్త చర్చలకు దారితీయనుంది.