మ్యాన్ ఆఫ్ పీస్.. ట్రంప్ పై పాక్ PM ప్రశంసలు.. ఎంత కాకా పట్టినా నో యూజ్!
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ పరువు తీసుకోవడం కొత్తేమీ కాదు కానీ, ఈసారి మాత్రం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏకంగా 'కాకా పట్టడంలో' పిహెచ్‌డీ చేసేశారు.;
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ పరువు తీసుకోవడం కొత్తేమీ కాదు కానీ, ఈసారి మాత్రం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏకంగా 'కాకా పట్టడంలో' పిహెచ్‌డీ చేసేశారు. గాజా శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి మురిసిపోయిన షరీఫ్, ఆయనను ఏకంగా 'దక్షిణాసియా రక్షకుడు' అని ఆకాశానికెత్తేశారు. భారత్-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌తో కంగారులో ఉన్న పాక్, ఇప్పుడు ట్రంప్ భజన చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో అని ఆశపడుతోంది.
బిస్కెట్లు వేయడంలో పాక్ నెం.1:
గాజా శాంతి మండలి సమావేశం సాక్షిగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన 'ట్రంప్ భజన' ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు అడ్డాగా మారింది. ఒకపక్క ట్రంప్ భారత్‌ను, మోదీని పొగుడుతుంటే.. ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవాలని షరీఫ్ తెగ ఆరాటపడ్డారు. "ట్రంప్ గారు మీరు మహానుభావుడు, శాంతి కాముకుడు.. మీరే లేకపోతే మా దక్షిణాసియా ఏమైపోయేదో" అంటూ ఆయన కురిపించిన పొగడ్తలు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అవును, ఇండియా దెబ్బకు పాక్ అంతం కాకుండా ట్రంప్ కాపాడాడు అంటూ గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు.
ట్రంప్ పాత పాట.. షరీఫ్ తాళం:
సమావేశంలో ట్రంప్ తన పాత రికార్డునే మళ్ళీ ప్లే చేశారు. భారత్-పాక్ యుద్ధం ఆపకపోతే 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరించి తానే శాంతిని కాపాడానని చెప్పుకున్నారు. అయితే భారత్ ఈ మాటలను ఎప్పుడో కొట్టిపారేసింది. కానీ, షరీఫ్ మాత్రం "అవును సామీ.. మీరు చెప్పిందే వేదం" అన్నట్లుగా తలూపారు. 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ అంటే, అవి ఎవరివో తెలిసినా తెలియనట్లుగా షరీఫ్ నటించడం కొసమెరుపు. మొత్తానికి అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు పాక్ ప్రధాని ఎంతకైనా దిగజారుతారని ఈ సీన్ నిరూపించింది.
మోదీ క్రేజ్.. వెనుక బెంచీలో షరీఫ్:
ఎన్ని పొగడ్తలు కురిపించినా, ఎంత కాకా పట్టినా.. చివరికి గ్రూప్ ఫోటో తీసేటప్పుడు మాత్రం షరీఫ్‌కు చుక్కెదురైంది. ప్రపంచ నేతలందరూ ముందు వరుసలో రాజసం చూపిస్తుంటే, మన పాక్ ప్రధాని మాత్రం ఎక్కడో వెనుక వరుసలో ముఖం మాడ్చుకుని నిలబడాల్సి వచ్చింది. అబ్జర్వర్ కంట్రీగా వెళ్లిన భారత్‌కు ఉన్న గౌరవం కూడా పూర్తిస్థాయి సభ్యుడిగా వెళ్లిన పాకిస్థాన్‌కు దక్కలేదు.
అప్పుల బాధ నుంచి గట్టెక్కడానికి అమెరికా ఆశీస్సులు కావాలని పాక్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి భజన చేయడం వల్ల గౌరవం పెరగకపోగా, ఉన్న పరువు కాస్తా గంగలో కలిసినట్లయింది అంటున్నారు నెటిజన్స్.