అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాద చర్చ.. పాక్‌పై శశిథరూర్ కన్నెర్ర!
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విదేశీ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న శశిథరూర్ కొలంబియా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.;
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విదేశీ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న శశిథరూర్ కొలంబియా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 'ఆపరేషన్ సింధూర్' సందర్భంగా పాకిస్థాన్‌లో హతమైన వారి పట్ల కొలంబియా ప్రభుత్వం సానుభూతి వ్యక్తం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద విధానాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందం ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో వివిధ దేశాల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శశిథరూర్ (Shashi Tharoor) నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియా (Colombia)లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఉగ్రవాద దాడుల బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయకుండా, భారత్ దాడుల తర్వాత పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల కొలంబియా ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేయడం మమ్మల్ని నిరాశపరిచింది. మేము మా ఆత్మరక్షణ హక్కును మాత్రమే వినియోగించుకున్నాము. 'ఆపరేషన్ సింధూర్'కు దారితీసిన పరిస్థితుల గురించి కొలంబియా అధికారులతో వివరంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈ దేశం కూడా అనేక ఉగ్రదాడులను చూసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక దాడులను భరించింది. పాకిస్థాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా, పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోంది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే మా విధానాలు ఉంటాయి" అని థరూర్ స్పష్టం చేశారు.
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన అమానవీయ ఉగ్రదాడి వెనుక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని థరూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని మొత్తం రక్షణ పరికరాల్లో 81% చైనా నుండి అందుతున్నవేనని ఆయన పేర్కొన్నారు.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor)ను నిర్వహించి, పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి పాకిస్థాన్ సైన్యం ప్రతిస్పందించి, మనపై ఎదురుదాడికి దిగింది. అయితే, మన బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.