శశిధరూర్ తో కాంగ్రెస్ కన్ను పొడుస్తున్న బీజేపీ !
భారతీయ జనతా పార్టీ చాలా చాణక్య రాజకీయాలను చూసింది. వాటిని అంతే ధీటుగా అమలు చేస్తుంది.;
భారతీయ జనతా పార్టీ చాలా చాణక్య రాజకీయాలను చూసింది. వాటిని అంతే ధీటుగా అమలు చేస్తుంది. చేతికి మట్టి అంటకుండా బీజేపీ వేసే ఎత్తుగడలు కాంగ్రెస్ వంటి తాతల నాటి పార్టీకే దగ్గులు కొత్తగా నేర్పిస్తున్నాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కేరళ రాష్ట్రంలోని కీలకమైన స్థానం తిరువనంతపురం లొక్ సభ సభ్యుడు శశిధరూర్ ఇపుడు సొంత పార్టీ కాంగ్రెస్ కే అడ్డం తిరుగుతున్నారా లేక కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ పెద్దలు ఆయనను ముందు పెట్టి కాంగ్రెస్ కన్ను పొడుస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ ని ఏకంగా కేంద్ర ప్రభుత్వం విదేశాలలకు వెళ్ళే అఖిల పక్ష బృందం లో ఒకదానిని నాయకత్వం వహించ బాధ్యతలు అప్పగించింది. పాక్ చేస్తున్న దుశ్చర్యలు ఇతర దేశాలలో ఎండగట్టాలని ఏడు కమిటీలను వివిధ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న సంగతి విధితమే.
అందులో శశిధరూర్ ని కూడా ముందుకు తెచ్చి కీలక బాధ్యతలు అప్పగించింది. అలా ఆయన తొందరలో విదేశాలకు వెళ్తున్నారు. తనకు ఎంతో బాధ్యతతో కేంద్రం అప్పగించిన పనిని చిత్తశుద్దితో చేయాలని చూస్తున్నారు. ఇదే ఇపుడు కాంగ్రెస్ లో చిచ్చు రాజేసేలా ఉంది. శశిధరూర్ పేరుని కాంగ్రెస్ ఏమీ ప్రతిపాదించలేదు. నిజానికి అఖిలపక్ష బృందాలను ఎంపిక చేస్తున్నామని మీ పార్టీ తరఫున ఎవరిని అయినా ప్రతిపాదిస్తారా అని కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను కోరుతుంది.
ఇదే పద్ధతి కూడా. కానీ కేంద్రం అలా కాంగ్రెస్ ని కోరింది కాంగ్రెస్ నుంచి సమాధానం రాకుండానే మరో వైపు శశిధరూర్ ని ఎంపిక చేసింది దాంతో కాంగ్రెస్ కి పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. ఇక శశిధరూర్ చూస్తే తన పార్టీ పెద్దల ఆలోచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం అప్పగించిన బాధ్యతలను ఆనందంగా స్వీకరించడం కూడా ఆ పార్టీ పెద్దలకు ఆగ్రహం కలిగిస్తోంది.
పోనీ పార్టీ ఆలోచనలు ఏమిటి అన్నది ఈ సందర్భంగా శశిధరూర్ ఆలోచించలేదు అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి మరింతగా మండుతోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక శశిధరూర్ వైఖరి ఈ మధ్య బాగా మారింది అని అంటున్నారు. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపేలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటనలో శశిధరూర్ ప్రధానితో కలసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ ఈ విధంగా శశిధరూర్ ని చూస్తే కనుక నిద్ర లేని రాత్రులే మిగులుతాయ్హని అన్నారు. అంటే బీజేపీతో కాంగ్రెస్ సీనియర్ నేత సావాసం చేస్తున్నారు అన్న అర్ధమే వచ్చింది.
ఇంకో వైపు చూస్తే కేంద్రంలోని బీజేపీ విదేన్శాంగ విధానం బాగుందని శశిధరూర్ పొగడడం కూడా కాంగ్రెస్ పెద్దలకు అసలు నచ్చడం లేదు అని అంటున్నారు. ఇక శశిధరూర్ రెండేళ్ళ క్రితం జరిగిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారు.
మరి ఆ తరువాత నుంచి కూడా శశిధరూర్ బాగానే కాంగ్రెస్ లో ఉంటున్నారా లేదా అన్నది ఒక చర్చ. ఇపుడు ఆయన ఏకంగా కాంగ్రెస్ కి దూరం జరగడానికి సిద్ధం అవుతున్నారా అన్నది మరో చర్చ. ఇక శశిధరూర్ మీద చర్యలు తీసుకుందామని కాంగ్రెస్ పెద్దలు అనుకున్నా కూడా ఇపుడు కుదిరేది కాదని అంటున్నారు.
ఎందుకంటే పహిల్గాం ఉగ్రదాడుల అనంతరం కేంద్రం తీసుకునే అనేక నిర్ణయాలకు కాంగ్రెస్ అవుట్ రేట్ గా మద్దతు ప్రకటించింది. పైగా దేశ ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇపుడు శశిధరూర్ వెళ్తోంది కూడా దేశం కోసమే. ఆయన పాక్ ఆగడాలని బయట దేశాలకు వివరించాలనుకోవడం ద్వారా దేశానికే మేలు చేసే కార్యక్రంలో ఉన్నారు. మరి ఆ విధంగా చూస్తే ఆయన ఏమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు.
దాంతో ఏ కారణం చూపించి ఆయనను పార్టీ చర్యలు తీసుకుంటుంది అన్నదే చర్చగా ఉంది. ఇంకో వైపు చూస్తే కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026లో ఉన్నాయి. దాంతో బీజేపీని పొగుడుతూ ఆ పార్టీ పెద్దలతో భేటీలు వేస్తూ వస్తున్న కాంగ్రెస్ ఎంపీగా శశిధరూర్ కాంగ్రెస్ లో ఉంటే ఒక తప్పుడు సంకేతం క్యాడర్ లోకి వెళ్తుందని కూడా ఆలోచిస్తున్నారుట. దాంతో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా అన్న మల్ల గుల్లాలు అయితే కాంగ్రెస్ పడుతోంది. మొత్తానికి శశిధరూర్ వైఖరి కాంగ్రెస్ పెద్దలకు మింగుడుపడటం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.