పూర్వవైభవం సాధ్యమేనా ?

కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకు వస్తానని కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా ఘనంగా ప్రకటించారు.;

Update: 2024-01-18 12:30 GMT

కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకు వస్తానని కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా ఘనంగా ప్రకటించారు. ప్రతి కార్యకర్తతో కలిసి నడుస్తానని, సీనియర్ల అనుభవంతో పార్టీ టార్గెట్ రీచ్చవ్వటానికి తనవంతు కృషి చేస్తానని ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పారు. షర్మిల ప్రకటన లేదా మాటలు చూస్తుంటే ఆమెలోని అపరిపక్వతే బయటపడుతోంది. తెలంగాణాలో పార్టీ పెట్టకముందు పెట్టిన తర్వాత కూడా ఇలా నోటికొచ్చింది మాట్లాడేసి చివరకు నవ్వుల పాలయ్యారు.

తెలంగాణాలో పార్టీ పెట్టినపుడు, ప్రచారంలో పార్టీ గురించి, తన ఆశయాల గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్న షర్మిల చివరకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. దాంతో షర్మిల స్టామినాపై జనాల్లో ఒక అంచనా ఏర్పడింది. ఇపుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కాగానే మళ్ళీ తెలంగాణాలో మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు పూర్వవైభవం షర్మిల వల్ల ఎప్పటికీ కానేకాదు. ఇపుడు కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటంటే భూస్ధాపితమైపోయింది. భూమిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇమేజిని మళ్ళీ పైకి లేపాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు.

రాష్ట్రవిభజన దెబ్బకు పార్టీకి జనాలు దూరమైపోయారు. అడ్డుగోలుగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ అంటే జనాల్లో ఇప్పటికీ మంటుంది. అందుకనే కాంగ్రెస్ కు జనాలు షర్మిల కోసమని ఓట్లేస్తారని అనుకునేందుకు లేదు. ఎందుకంటే షర్మిలకంటు ప్రత్యేకమైన గుర్తింపు లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు లేదా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అంతే ఆమెకున్న గుర్తింపు. సొంతంగా అస్తిత్వాన్ని చాటుకునేందుకే తెలంగాణాలో పార్టీ పెట్టి చాపచుట్టేశారు. దాంతో షర్మిలపై జనాల్లో నెగిటివ్ ముద్రపడిపోయింది.

కాంగ్రెస్ లో ఇపుడున్న చాలామంది నేతలకు ఇతర పార్టీల్లో అవకాశాలు రానికారణంగా మాత్రమే కంటిన్యు అవుతున్నారంతే. రాష్ట్రంలో కాంగ్రెస్ అనే పార్టీ ఒకటుందని కూడా జనాలు ఆలోచించటంలేదు. కాబట్టి షర్మిల చెప్పుకున్నట్లు కాంగ్రెస్ కు పూర్వవైభవం ఇప్పట్లో సాధ్యంకాదు. షర్మిల కారణంగా ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరి ఎంఎల్ఏలుగా పోటీచేయవచ్చు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి కొన్ని ఓట్లు పెరిగే అవకాశముందంతే. అంతేకానీ కాంగ్రెస్ తరపున ఎవరు గెలిచే అవకాశం మాత్రం కనబడటంలేదు.

Tags:    

Similar News