తవ్వేకొద్దీ బయటపడుతున్న దేశద్రోహులు.. తాజాగా మరో వ్యక్తి అరెస్ట్!
ఈ క్రమంలో ఇప్పటికే రకరకాల ముసుగుల్లో ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పట్టుబడగా.. తాజాగా మరో కీలక అరెస్ట్ చోటుచేసుకుంది.;
భారతదేశంలో పుట్టి, ఇక్కడ నీరు తాగి, ఇక్కడ గాలి పీల్చి.. పాకిస్థాన్ కు ఊడింగం చేస్తోన్న దేశద్రోహుల వ్యవహారాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి! ఈ క్రమంలో ఇప్పటికే రకరకాల ముసుగుల్లో ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పట్టుబడగా.. తాజాగా మరో కీలక అరెస్ట్ చోటుచేసుకుంది. ఆయన ఓ రాజకీయ పార్టీ నేత మాజీ పీఎ కమ్ ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం!
అవును... ప్రభుత్వ ఉద్యోగి, ఓ రాజకీయ పార్టీ నేత మాజీ పీఏ కూడా అయిన రాజస్థాన్ కు చెందిన షాకూర్ ఖాన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇప్పటికే సుమారు ఆరేడుసార్లు పాకిస్థాన్ కు వెళ్లి వచ్చాడని అధికారులు తెలిపారు. దీంతో.. అతడి మొబైల్ ఫోన్ ను చెక్ చేయగా.. అందులో పలు పాక్ ఫోన్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.
ఇదే సమయంలో... షాకూర్ ఖాన్ కు చెందిన బ్యాంక్ అకౌంట్స్ పై కూడా అధికారులు దృష్టి సారించారని.. ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెడితే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారని అంటున్నారు. పైగా.. తన ఫోన్ లోని పాకిస్థాన్ నెంబర్స్ గురించి అతడు చెప్పిన సమాధానాలు సరిగ్గా లేకపోవడంతో దానిపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయని అంటున్నారు.
ఇలా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ఒక రాజకీయ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ అరెస్ట్ తో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని, అంతర్గత నిఘాను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోందని అంటున్నారు. దీంతో.. ఇంకా ఎంత మంది దేశద్రోహులు దాగి ఉన్నారో అనే విషయం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.
జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... షాకుర్ ఖాన్ రాజస్థాన్ కాంగ్రెస్ పాలనలో మాజీ మంత్రి షేల్ మొహమ్మద్ కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడని అంటున్నారు! షాకుర్ ఖాన్, మొహమ్మద్ ల గ్రామాలు ఒకదానికొకటి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి... ఆపరేషన్ సిందూర్ తర్వాత ముఖ్యంగా జైసల్మేర్ వంటి సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో.. గత నెల రోజుల్లో సరిహద్దుల్లో అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకోగా.. షాకుర్ ఖాన్ ఏడో వ్యక్తి అని అన్నారు.