బీజేపీ జాబితాలో కనిపించని పలువురు సీనియర్ల పేర్లు... కారణం ఇదేనా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ కూడా దూకుడు పెంచింది.;

Update: 2023-10-22 16:00 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా... 52 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈటెల రాజేందర్.. హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ముగ్గురు ఎంపీలు ఈసారి శాసనసభకు పోటీ చేయనున్నారని ఆ జాబితాలో వెల్లడైంది. అయితే... తాజాగా బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో పలువురు సీనియర్లు, కీలక నేతల పేర్లు మిస్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

అవును... 52మందితో బీజేపీ తాజాగా విడుదల చేసిన తొలిజాబితాలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ఈసారి శాసనసభకు పోటీ చేయించబోతున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా... బండి సంజయ్ (కరీంనగర్), ఎంపీ అర్వింద్ (కోరుట్ల), సోయం బాపూరావు (బోథ్) లు ఈ దఫా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ బీజేపీలో కీలకమైన నేతల పేర్లు తొలిజాబితాలో మిస్సయ్యాయి.

దీనికి కారణం వ్యూహాత్మకతా.. లేక, అస్పష్టతా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ తొలి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈయన గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం జరిగిన ఉపఎన్నికలో ఓటమి పాలయ్యారు. దీంతో... బీజేపీ తొలిజాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

పైగా గతకొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తొలిజాబితాలో ఆయన పేరు లేకపోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి నిలబెట్టబోతున్నారనే కథనాలొచ్చిన నేపథ్యంలో... ఈ తొలిజాబితాలో విజయశాంతిపేరు కూడా కనిపించలేదు. ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇదే క్రమంలో... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి లతోపాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ల పేర్లు తొలిజాబితాలో లేవు. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థులైన బండి సంజయ్, అర్వింద్, సోయం బాపూరావుల పేర్లు ఎమ్మెల్యేలుగా వెల్లడించారు. దీంతో... ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే... వీరిలో చాలా మంది ఎంపీలుగా పోటీచేయాలనే ఆలోచనతో, ఆసక్తితో ఉన్నారని.. అందుకే వీరి పేర్లు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో లేవని చెబుతున్నారు.

మరి జరుగుతున్న చర్చలే నిజమా.. లేక, రెండో జాబితాలో ఏదైనా ఛాన్స్ ఉంటుందా అనేది వేచి చూడాలి. మరోపక్క జనసేనతో పొత్తు ఓకే అయితే ఆ పార్టీకి కూడా 10 నుంచి 12 స్థానాలు ఇవ్వబోతున్నారనే కథనాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో... వీరి పేర్లు లేకపోవడంకూడా తోడవడంతో... రెండో లిస్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News