రియల్ ఎస్టేట్‌లో సరికొత్త మార్పు..సెల్ఫీ అపార్ట్‌మెంట్స్ కాన్సెప్ట్ ఇదే
ఈ కోవలోనే తాజాగా 'సెల్ఫీ అపార్ట్‌మెంట్స్' అనే సరికొత్త కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;
మారుతున్న కాలానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ట్రెండ్స్ మారుతున్నాయి. కొనుగోలుదారుల అభిరుచులను తగ్గట్లుగా విభిన్నమైన ప్రాజెక్టులు తెరమీదకు వస్తున్నాయి. ఒకవైపు విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంటే, మరోవైపు తక్కువ స్థలంలోనే అన్ని ఫెసిలిటీలు కలిగిన ఇళ్లకు ఆదరణ లభిస్తోంది. ఈ కోవలోనే తాజాగా 'సెల్ఫీ అపార్ట్‌మెంట్స్' అనే సరికొత్త కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ సెల్ఫీ అపార్ట్‌మెంట్స్ అంటే ఏమిటి? వీటిని ఎక్కడ నిర్మిస్తున్నారు? హైదరాబాద్‌లో వీటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వివరంగా తెలుసకుందాం.
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొనుగోలుదారుల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే పెద్ద పెద్ద, లగ్జరీ ప్రాజెక్ట్‌ల హవా నడుస్తోంది. ఒక్కో ఫ్లాట్‌ను ఏకంగా 5 వేల నుంచి 13,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి చాలా ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా చాలా తక్కువ స్థలంలో ఉండే 'సెల్ఫీ అపార్ట్‌మెంట్స్' కేరళ వంటి రాష్ట్రాల్లో నిర్మిస్తున్నారు. వీటిని హైదరాబాద్ లాంటి నగరాల్లో నిర్మిస్తే ఎలా ఉంటుందని సిటీ బిల్డర్లు ఆలోచనలు చేస్తున్నారు.
ఒంటరిగా ఉండేవారి కోసం గతంలో కొన్ని నిర్మాణ సంస్థలు నగరంలో స్టూడియో అపార్ట్‌మెంట్లను నిర్మించారు. ఇవి దాదాపు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడక గది, వంటగది, బాత్రూమ్‌తో ఉండేలా డిజైన్ చేశారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చి ఒంటరిగా ఉండేవారు హాస్టల్స్‌లో, పీజీల్లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈ స్టూడియో అపార్ట్‌మెంట్లు నిర్మించారు.
కానీ ఇప్పుడు సెల్ఫీ అపార్ట్‌మెంట్లు అంటే స్టూడియో అపార్ట్‌మెంట్లలో నాలుగో వంతు స్థలంలోనే ఉంటాయి. కేరళలోని కొచ్చిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కేవలం 96 చదరపు అడుగుల్లోనే ఒక సెల్ఫీ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను నిర్మించింది. ఇంత తక్కువ స్థలంలోనే ఒక పడక గది, వంటగది, బాత్రూమ్ ఉండేలా ఆర్కిటెక్ట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. స్థలం తక్కువ కాబట్టి ఫర్నిచర్ అంతా గోడకు అమర్చే విధంగా (వాల్ మౌంటెడ్‌గా) రూపొందించారు. అవసరమైనప్పుడు వాడుకుని తర్వాత ఎంచక్కా మడత పెట్టేయవచ్చు. వీటిని వర్క్ స్టేషన్ లాగా, స్టడీ టేబుల్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సెల్ఫీ అపార్ట్‌మెంట్లను మైక్రో అపార్ట్‌మెంట్లు అని కూడా పిలుస్తున్నారు. వీటిలో స్థలం కొంచెం పెరిగితే వాటిని సెల్ఫీ ప్రీమియం, సెల్ఫీ ప్లస్ పేరుతో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం చేస్తున్నారు.
ఈ తరహా సెల్ఫీ, మైక్రో అపార్ట్‌మెంట్లను సాధారణంగా చాలా ఖరీదైన, వ్యాపార కేంద్రాల్లోనే నిర్మిస్తుంటారు. ఇంటి నుంచి బయటికి వెళితే దగ్గరలోనే మాల్స్,హోటల్స్, మల్టీప్లెక్స్‌లు, విద్యాసంస్థలు, కార్యాలయాలు ఉండే ప్రాంతాలను ఎంచుకుని వీటి నిర్మాణం చేపడుతుంటారు. వీటిని మొదటిసారిగా నిర్మించిన ఒక సంస్థ చదరపు అడుగు రూ.20వేలకు విక్రయించిందని ఒక నగర బిల్డర్ చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ఈ కాన్సెప్ట్‌తో సెల్ఫీ అపార్ట్‌మెంట్లు నిర్మించాలనే ఆలోచన ఉందని ఆ బిల్డర్ తెలిపారు.
నగరంలో ఐటీ, వైద్యం, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు చాలా బిజీగా ఉంటారు. పని చేసే చోట ఉందామంటే హాస్టల్స్, పీజీలు తప్ప వేరే అవకాశం లేదు. వాటిలో భద్రత అనేది పెద్ద ప్రశ్నార్థకం. అందుకే చాలామంది కష్టమైనా సరే ఐటీ కారిడార్‌కు 40, 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. సెల్ఫీ, మైక్రో అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటే పని చేసే రోజుల్లో ఇక్కడ ఉండటానికి సెలవు రోజుల్లో తల్లిదండ్రులతో ఉండటానికి వీలవుతుందని నిర్మాణదారులు అంటున్నారు.