ఫోన్ తో స్కాన్ చేస్తే చేతికి ప్రింట్.. కూకట్ పల్లి మెట్రో స్టేషన్ లో కియోస్క్

టెక్నాలజీ మారింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. జేబులో వాలెట్ అవసరం లేని పరిస్థితి.;

Update: 2026-03-13 05:11 GMT

టెక్నాలజీ మారింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. జేబులో వాలెట్ అవసరం లేని పరిస్థితి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అదొక్కటే కాదు.. రోజు వారీ జీవితంలోని ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్.. అందులో తగినంత డేటా ఉంటే చాలు.. ఏ పనైనా ఇట్టే జరిగిపోయే పరిస్థితి. సాధారణంగా ఏదైనా ప్రింట్ కావాలంటే.. జిరాక్స్ షాపుకు వెళతాం. అలాంటి వాటికి చెల్లుచీటి ఇచ్చేలా.. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేకుండా.. ఒక కియోస్క్ తో చూపించిన సొలూష్యన్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఔరా.. టెక్నాలజీ అనుకోకుండా ఉండలేం.




 


ఇంతకూ ప్రింట్ కోసం కియోస్క్? ఏమిటి అంటారా.. అక్కడికే వస్తున్నాం. ఒకప్పుడు డబ్బులు డ్రా చేసుకోవటానికి కియోస్కీలను వాడేవాళ్లం. ఇప్పుడు హైదరాబాద్ లోని పలుచోట్ల ఫ్రెష్ జ్యూస్ కోసం కియోస్క్ లు వచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. కోరుకున్న డాక్యుమెంట్ ను ప్రింట్ చేసుకోవటానికి వీలుగా ఈ కియోస్క్ సాయం చేస్తుంది. కుకట్ పల్లి మెట్రో స్టేషన్ లో వద్ద ‘వికి ప్రింట్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకూ ఇదెలా పని చేస్తుందంటే..

కియోస్క్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ను ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే.. ఫైల్ అప్ లోడ్ అని వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అవసరమైన ఎన్నో ఫైళ్లు.. సర్టిఫికేట్లను ఫోన్ లో సేవ్ చేసుకుంటున్న నేపథ్యంలో.. ఫోన్ లో ఉన్న డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయగానే.. బ్లాక్ అండ్ వైట్ లోనా.. కలర్ లో ప్రింట్ కావాలా? అని అడుగుతుంది. అదే సమయంలో ఎన్ని ప్రింట్లు కావాలో కూడా అడుగుతుంది. వాటిపై టిక్ పెట్టిన వెంటనే.. యూపీఐ పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్లి.. ఎంత డబ్బులు చెల్లించాలో చెబుతుంది.

ఫోన్ లో ఉన్న వాలెట్ లో నుంచి డబ్బులు చెల్లించిన తర్వాత మన ఫోన్ నెంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.దీంతో.. ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని మిషిన్ లో ఉన్న కీ ప్యాడ్ తో ఎంటర్ చేసినంతనే.. మనం కోరుకున్న ప్రింట్లు ఎంచక్కా వచ్చేస్తాయి. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు చెన్నై నుంచి ఈ మెషీన్ ను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఈ కియోస్క్ మామూలు జిరాక్స్ షాపుల్లో ప్రింట్ తో పోలిస్తే కాస్త ఖరీదే అయినప్పటికి.. మరో వ్యక్తితో సంబంధం లేకుండా.. ఇట్టే ప్రింట్ తీసుకునే వెసులుబాటును కలిగిస్తుందని చెప్పక తప్పదు. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఈ తరహాలో మరెన్ని కియోస్క్ లు అందుబాటులోకి వస్తాయో?

Tags:    

Similar News