సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికలు.. వెంటనే స్పందించిన మంత్రి!
తెలంగాణ మంత్రి, మావోయిస్టు మాజీ నేత సీతక్క అలియాస్ దనసరి అనసూయకు మావోయిస్టులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.;
తెలంగాణ మంత్రి, మావోయిస్టు మాజీ నేత సీతక్క అలియాస్ దనసరి అనసూయకు మావోయిస్టులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా, మంత్రిగా ఉన్న సీతక్క పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఆదివాసీలను అటవీ, పోలీసు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీతక్క మౌనం వహిస్తున్నారని, కనీసం స్పందించడం లేదని మావోయిస్టులు తమ లేఖలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 అటవీ హక్కుల చట్టాన్ని సీతక్క మరచిపోయారా? అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీతక్క కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ ఆమె సాదాసీదాగా వ్యవహరిస్తారని చెబుతారు. ఇక కరోనా సమయంలోనూ, ఆదివాసీ బిడ్డలు వరదల్లో చిక్కుకున్నప్పుడు సీతక్క అన్నీ తానై ఆదుకునేవారు. అయితే ఆమె మంత్రి అయిన తర్వాత ఆదివాసీలు పలు సమస్యలు ఎదుర్కుంటున్నట్లు మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులు కాపాడే బాధ్యత మంత్రి సీతక్కదేనని గుర్తు చేశారు జీవో 49 ద్వారా కుమురం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని జరుగుతున్న పరిణామాలను మావోయిస్టులు తప్పుపట్టారు.
జీవో 49 వల్ల మూడు జిల్లాలు కనుమరుగువుతున్నాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే జీవో 49ను రద్దు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అయితే మావోయిస్టుల హెచ్చరిక లేగలపై మంత్రి సీతక్క వెనువెంటే స్పందించారు. తన మూలాలను తానెప్పుడు మరచిపోలేదన్నారు. జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఆ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.