యూరప్ ట్రిప్ ప్లాన్ చేసేవాళ్లకు అలెర్ట్
షెంజెన్ వీసా ఉన్న ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో గరిష్టంగా 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించవచ్చు.;
యూరప్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఇప్పుడు అదనపు ఖర్చు తప్పదు. షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజులు తాజాగా పెరగడం వల్ల యూరప్ ట్రిప్ మొత్తం ఖర్చు మరింతగా పెరిగే అవకాశముంది.
- వీఎఫ్ఎస్ గ్లోబల్ ఛార్జీలు పెంపు
చాలా యూరోపియన్ దేశాలకు వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసే ప్రైవేట్ ఏజెన్సీ అయిన వీఎఫ్ఎస్ గ్లోబల్ (VFS Global) తన సర్వీస్ ఛార్జీలను పెంచింది. 2023 తర్వాత ధరలలో మార్పు రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా పెద్దలకు షెంజెన్ వీసా బేస్ ఫీజు రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు ఉంటుంది. దీనికి అదనంగా వీఎఫ్ఎస్ గ్లోబల్ సర్వీస్ ఫీజులు వసూలు చేస్తోంది.
- ప్రస్తుతం కొన్ని దేశాల సర్వీస్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి. జర్మనీ - రూ. 1,933, స్విట్జర్లాండ్ – రూ. 2,690, పోర్చుగల్ – రూ. 3,111, ఫ్రాన్స్ – రూ. 2,234, ఆస్ట్రియా – రూ. 2,274. ఈ ఫీజులకు అదనంగా కొరియర్ డెలివరీ, ఎస్ఎంఎస్ అప్‌డేట్స్, ప్రీమియం లాంజ్ యాక్సెస్ వంటి సేవలకూ వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
- షెంజెన్ వీసా ప్రత్యేకత
షెంజెన్ వీసా ఉన్న ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో గరిష్టంగా 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించవచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసేవారు ట్రావెల్ ప్లాన్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ప్రూఫ్ వంటి ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- రూపాయి బలహీనత.. మరో భారమైన కారణం
వీసా ఫీజుల పెంపుతో పాటు, కరెన్సీ మార్పిడి రేట్లు కూడా భారతీయ పర్యాటకులపై భారం పెంచుతున్నాయి. గత దశాబ్ద కాలంలో రూపాయి యూరో ముందు బలహీనపడింది. దీని వల్ల యూరప్ ట్రిప్ ఖర్చు మరింతగా పెరిగింది.
2015లో 1 యూరో = రూ. 72.12 , 2020లో 1 యూరో = రూ. 84.64, 2023లో 1 యూరో = రూ. 89.20, 2024లో 1 యూరో = రూ. 90.55, 2025 జూన్ నాటికి 1 యూరో విలువ రూ. 100 దాటింది.
ఈ కారణాల వల్ల యూరప్ పర్యటనలు ఇప్పుడు మధ్య తరగతి భారతీయులకు మరింత ఖరీదైనవిగా మారాయి. వీసా ఫీజుల పెంపు, రూపాయి బలహీనత కలగలిసి యూరప్ ట్రిప్ ఖర్చును బాగా పెంచాయి. అయితే యూరప్ అందాలను చూడాలనుకునేవారు ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకుని వెళ్ళడం తప్పనిసరి.