1,825 చెట్లు నరికివేయాలనే తీర్మానం... సయాజీ శిండే కీలక వ్యాఖ్యలు!
చెట్లను నరికివేయాలనే నిర్ణయం ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు వారం రోజులుగా పర్యావరణవేత్తల నిరసనలు కొనసాగుతున్నాయి.;
చెట్లను నరికివేయాలనే నిర్ణయం ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు వారం రోజులుగా పర్యావరణవేత్తల నిరసనలు కొనసాగుతున్నాయి. సుమారు 35 ఎకరాల్లో 1,825 చెట్లను నరికివేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) తీర్మానించిన వేళ ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సయాజీ శిండే తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
అవును... మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల చెట్ల నరికివేతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు, పర్యావరణ కార్యకర్త, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సభ్యుడు సయాజీ షిండే స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. చెట్లను నరికివేసి ప్రజలను ఎగతాళి చేయవద్దని కుంభమేళా మంత్రి గిరీశ్ మహాజన్ ను ఉద్దేశించి అన్నారు.
వచ్చే ఏడాది కుంభమేళా నాటికి పంచవటి, తపోవనాల్లో సాధువుల కోసం వసతిగృహాలు నిర్మించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం.. ఈ పనుల కోసం రూ.220 కోట్ల విలువైన టెండర్లను పిలిచింది. ఈ సమయంలో అక్కడున్న మొత్తం 35 ఎకరాల్లోని 1,825 చెట్లను నరికివేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించడాన్ని సయాజీ షిండే తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తాజాగా తపోవనాన్ని సందర్శించిన ఆయన.. చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా... ఏ చెట్టునూ నరకివేయాల్సిన అవసరం లేదని.. కార్పొరేషన్ వారికి స్థలం ఉన్న చోట ఈ సాధుగ్రామ్ ను ఏర్పాటు చేయవచ్చని.. వారు దూరంగా ఉన్నప్పటీకీ.. ప్రభుత్వం వారి కోసం మౌలిక సదుపాయాలను నిర్మించగలదని అన్నారు.
ఈ సందర్భంగా తొక్కిసలాటలను నివారించడానికి తీర్ధయాత్ర స్థలాల దగ్గర ఏర్పాట్లు అవసరమని అంటున్నారని.. మానవ ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్న చోట ఎందుకు ఏదైనా సమావేశాన్ని నిర్వహించాలని ఆయన ప్రశ్నించారు. ఈ తీర్మానం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. ఈ నిర్ణయం పర్యావరణానికి పెను ముప్పని అన్నారు!
కాగా.. రాముడు తన వనవాస సమయంలో గోదావరి నదిలో పవిత్ర స్నానం కోసం తపోవనాన్ని సందర్శించాడని నమ్మేవారికి ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతం రాబోయే సింహస్థ కుంభమేళాకు వేదిక. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ భారీ కారక్రమం అక్టోబర్ 2026, జూలై 2028 మధ్య మొత్తం 18 నెలల పాటు జరగనుంది.
ఈ కార్యక్రమంలో సుమారు 10 మిలియన్లకు పైగా సందర్శకులు, భక్తులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో.. సుమారు 4 లక్షలకు పైగా సాధువులు పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం సాధుగ్రామం నిర్మించాలని, అక్కడ వీరికి తాత్కాలిక వసతిని కల్పించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది!
అయితే... దీనికోసం అన్ని చెట్లను నరికివేయాలని నిర్ణయాన్ని మాత్రం అంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కోరుతున్నారు! ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పర్యావరణవేత్తలు పెద్ద క్యాంపెయినే నడుపుతున్నారు!