నటి కంపెనీ కాకి లెక్కలు.. మరో సత్యం రామలింగరాజు కథలా!
కంపెనీ ఆదాయంలో అసలు నిజాన్ని దాచిపెట్టి లేని హైప్ ని క్రియేట్ చేసేందుకు తప్పుడు కాకి లెక్కల్ని చూపించడం ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పేందుకు అతి పెద్ద ఉదాహరణ `సత్యం రామలింగరాజు` కథ.;
కంపెనీ ఆదాయంలో అసలు నిజాన్ని దాచిపెట్టి లేని హైప్ ని క్రియేట్ చేసేందుకు తప్పుడు కాకి లెక్కల్ని చూపించడం ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పేందుకు అతి పెద్ద ఉదాహరణ `సత్యం రామలింగరాజు` కథ. సత్యం కంప్యూటర్స్ ఉత్థాన పతనంలో ఆయన తెలిసీ చేసిన తప్పిదాలు చరిత్ర పాఠాలుగా నిలిచిపోయాయి. ఒక సాధారణ మధ్యతరగతి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సత్యం రామలింగరాజు `సత్యం కంప్యూటర్స్` షేర్స్ విలువ పెంచేందుకు తప్పుడు ఆదాయ పట్టికతో కంపెనీ విలువను హైప్ చేయడం, ఆ తర్వాత అతడి స్కామ్ బయటపడటంతో జైలుకు వెళ్లడం వంటి విషయాలు ఒక సినిమా కథను తలపిస్తాయి.
అయితే అలాంటి తప్పిదం కాదు కానీ, తన కంపెనీ విలువను ఉన్నదాని కంటే పెంచి చూపించడం ద్వారా ఉత్పత్తుల అమ్మకాల్లో మెరుగుదలను ఆశిస్తోంది ప్రముఖ కథానాయిక. సదరు కథానాయిక స్కిన్ కేర్ ఉత్పత్తిని ప్రారంభించిన కేవలం రెండేళ్లలోనే 400 కోట్ల సంపదను సృష్టించామని కాకి లెక్కలు ప్రచారం చేయడాన్ని మార్కెట్ విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఇందులో వాస్తవం కంటే హైప్ ఎక్కువగా ఉంది. 2023లో కేవలం 7.5 కోట్ల ఆదాయం మాత్రమే సాధించిన ఈ కంపెనీ ఇంతలోనే 2024లో ఏకంగా రూ.400 కోట్ల రేంజుకు చేరుకోవడం అంటే ఇది అందరినీ ఆలోచింపజేస్తోంది. దాదాపు 5600 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసిందని దీనర్థం. కానీ ఇది నిజమేనా? కేవలం 20శాతం వార్షిక వృద్ధి సాధిస్తేనే స్కిన్ కేర్ ఉత్పత్తుల రంగంలో గొప్ప. అలాంటిది 5,600 శాతం వృద్ధి నమోదు అంటే అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వాస్తవానికి ఈ ప్రచారం నిజం కాదని, దీనిని నమ్మకూడదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి స్టార్టప్‌లు ఉపయోగించే ట్రిక్కు ఇది. ఆర్థికంగా హైప్ క్రియేట్ చేయడం ద్వారా ఏదో సాధించాలని యజమానులు అనవసర కలలు గంటారు. కానీ ఇది అబద్ధం అని తెలిసాక మరో సత్యం కంప్యూటర్స్ కథ రిపీటవుతుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. వార్షికాదాయాన్ని అంచనా వేయడానికి ఒక రోజు లేదా పది రోజుల ఆదాయాన్ని పరిగణించకూడదు. ఒక రోజు కోటి సంపాదిస్తే సంవత్సరంలో 365 రోజులు 365 కోట్లు ఆదాయం వచ్చినట్టు కాదు! ప్రయివేట్ స్టార్టప్ లు చట్టబద్ధంగా లెక్కలు చెప్పాల్సిన అవసరం లేనందున ఇలాంటి హైప్ క్రియేట్ చేయడం చాలా సహజం. కానీ అనూహ్యంగా అంత పెద్ద ఆదాయం దక్కడం, కంపెనీ నికర విలువ పెరగడం అనేది అసాధ్యం. అయితే ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా స్టార్టప్‌లు మార్కెట్ విశ్వసనీయతను కోల్పోతాయి. దీనిని రిపీట్ చేయకుండా సదరు కథానాయిక తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తన కంపెనీని నిలబెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.