సత్యకుమార్ చెప్పిన క్లెప్టోక్రసీ అంటే ఏంటి? తెలుగువారికి అర్థం కాని కొత్త పదంలో అంత అర్థముందా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు అత్యంత సహజం.. కాలం మారుతున్న కొద్దీ ఈ విమర్శల్లో పదును పెరుగుతుంది.;

Update: 2025-09-11 14:30 GMT

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు అత్యంత సహజం.. కాలం మారుతున్న కొద్దీ ఈ విమర్శల్లో పదును పెరుగుతుంది. ఒకప్పుడు విమర్శలు రాజకీయాలు వరకు మాత్రమే పరిమితమయ్యాయి. తర్వాత కాలంలో పరిధులు దాటాయి. వ్యక్తిగత విమర్శలతోపాటు కుటుంబ సభ్యులను దూషించేవరకు ప్రస్తుతం పరిస్థితి వెళ్లింది. ఇదే సమయంలో కొత్తకొత్త పేర్లతో నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. ఈ నిందలు కొన్ని నేతల అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో దాడులు ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. అయినా విమర్శలలో పదును తగ్గడం లేదు. ఇక తాజాగా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభలో మాట్లాడిన ఈ బీజేపీ నేత గత ప్రభుత్వాన్ని ‘క్లెప్టోక్రసీ’ పేరుతో విమర్శించారు. తెలుగు రాజకీయాల్లో కొత్తగా వినిపించిన ఈ పదం అర్థం ఏంటో తెలుసుకోడానికి పొలిటికల్ జనం ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు.

మనం దేశంలో బ్యూరోక్రసీ విన్నాం.. ఈ క్లెప్టోక్రసీ ఏంటీ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గత పాలకలు పంచ భూతాలను కూడా వదల్లేదని ఆరోపిస్తూ మంత్రి సత్యకుమార్ ఈ ‘క్లెప్టోక్రసీ’ని ప్రస్తావించారు. దీనిపై ఆన్లైన్ లో సెర్చ్ చేయగా, ‘క్లెప్టోక్రసీ’ అంటే "దొంగల ప్రభుత్వం" అని అర్థంగా వెల్లడైంది. ఈ పదం గ్రీకు భాషలోని రెండు పదాల నుంచి వచ్చింది: ‘క్లెప్టెన్’ అంటే దొంగలించడం, ‘క్రటస్’అంటే పాలన అని అర్థమట. క్లెప్టోక్రసీలో ప్రభుత్వం లేదా పాలకులు తమ పదవిని ఉపయోగించుకుని ప్రజల సంపదను, దేశ ఆర్థిక వనరులను దొంగిలిస్తారు. ఈ పాలనలో నాయకులు తమ వ్యక్తిగత సంపదను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారని చెబుతున్నారు.

ఇక అవినీతికి క్లెప్టోక్రసీకి ప్రధాన పునాదిగా అభివర్ణిస్తున్నారు. పాలకులు ప్రభుత్వ నిధులు, వనరులను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటారని, ఇది క్లెప్టోక్రసీ పాలనలో సాధారణంగా జరుగుతుందని అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ లావాదేవీలు, ఒప్పందాలు, ఖర్చుల వివరాలు అత్యంత రహస్యంగా ఉంటాయని పారదర్శకత ఎక్కడా ఉండదని చెబుతున్నారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరు గురించి ఏ మాత్రం సమాచారం ఉండదని చెప్పేందుకు క్లెప్టోక్రసీని ఉదహరిస్తారని అంటున్నారు.

అదేవిధంగా న్యాయ వ్యవస్థను బలహీనం చేయడం, పాలకులు తమ అవినీతి చర్యలను కప్పిపుచ్చుకోవడానికి న్యాయమూర్తులను, పోలీసులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం కూడా ఇందులో భాగమని అంటున్నారు. ప్రజల విమర్శలు, నిరసనలను బలవంతంగా అణచివేయడం, మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలను బెదిరించి, అదుపులో ఉంచుకోవడం కూడా దీనికిందకే వస్తుందని అంటున్నారు. క్లెప్టోక్రసీ పాలనలో సంపద అంతా కొంతమంది పాలకుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది. దీనివల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అంటున్నారు.

క్లెప్టోక్రసీకి ఉదాహరణగా కొన్ని ఆఫ్రికా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికా దేశాలను చెబుతారు. జింబాబ్వే, నైజీరియా, కాంగో వంటి దేశాలు దీనికి కొన్ని ఉదాహరణలు. ఈ దేశాలలో పాలకులు ప్రజల సొమ్మును కొల్లగొట్టి, విదేశాల్లో ఆస్తులను పోగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. క్లెప్టోక్రసీ అనేది కేవలం దొంగతనం మాత్రమే కాదు, అది ఒక దేశాన్నే నాశనం చేసే ఒక రాజకీయ వ్యవస్థ. ఇంతటి తీవ్రమైన అర్థం ఉన్న క్లెప్టోక్రసీని గత ప్రభుత్వం అనుసరించిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించడం చర్చనీయాంశం అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ టార్గెట్ గా ఈ స్థాయి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక సారి డ్రగ్స్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించారు. ఇప్పుడు సత్యకుమార్ కూడా అవే తరహా విమర్శలు గుప్పించడం విశేషం.

Tags:    

Similar News