సంచార్ సాథీపై సెంట్రల్ వెనుకంజ....

ఔను ...మీ మొబైల్ లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరేం కాదు. మీ ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చని వద్దనకుంటే డిలీట్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.;

Update: 2025-12-02 10:18 GMT

ఔను ...మీ మొబైల్ లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరేం కాదు. మీ ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చని వద్దనకుంటే డిలీట్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అసలు కేంద్ర ఈ యాప్ ను ఎందుకు ప్రతిపాదించింది? ప్రయోజనాలేంటి? వద్దనేవారి కారణాలేంటి? ఇవన్నీ ఆసక్తికరంగా మారుతున్నాయి.

అనునిత్యం సైబర్ నేరాలు పెచ్చుపెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆ నేరాల ఉచ్చుకు తగులుకునే వారి సంఖ్య కూడా అంతే పెరిగిపోతోంది. ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సైబర్ సెక్యూరిటీ పెంచేందుకు కేంద్ర ఈ మధ్యన సంచార్ సాథీ పేరిట ఓ యాప్ ప్రవేశపెట్టింది.

సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు కొత్తగా విక్రయించే ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ సంచార్ సాథీ యాప్ డీఫాల్ట్ గా ఇన్ స్టాల్ చేయాలని కేంద్రం ఆయా కంపెనీలను కోరింది. ఈ మేరకు టెలికాం మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేటు మొబైల్ తయారీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం అమలుకు 90 రోజుల గడువు కూడా విధించింది. ఆ తర్వాత వచ్చే ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరిగా కనిపించాలని తెలిపింది. అంటే మొబైల్ లో సంచార్ సాథీ యాప్ కనిపించేలా ఉండాలి...వినియోగించుకోడానికి అనువుగా ఉండాలి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ డిజేబుల్ చేయడానికి వీల్లేదు. అయితే కేంద్రం నిర్ణయం కొందరికి ఆమోద యోగ్యం కాగా, చాలా మందికి ఇబ్బందిగా మారింది. ప్రజలు తమ గోప్యతకు ఇది భంగం కలిగిస్తుందని భావించారు.

మొబైల్ తయారు చేసే కంపెనీలు కూడా తమతో ఏమాత్రం చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు కేంద్రం ఎలా తీసుకుంటుందని అసంతృప్తి వ్యక్తం చేశాయి. యాపిల్, సామ్ సంగ్, షియామీ లాంటి సంస్థలు కేంద్రం ఆదేశాలకు కనీసం స్పందించలేదు కూడా. ప్రభుత్వం అయినా థర్డ్ పార్టీ యాప్ అయినా అమ్మకానికి ముందే కంపెనీ ఇన్ స్టాల్ చేయడం తమ విధానం కాదని యాపిల్ సంస్థ అంటోంది. ఈ విషయంగా కేంద్రం యాపిల్ సంస్థ మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

ఇలా సెక్యూరిటీ పేరిట ప్రజల ఫోన్లలో యాప్ పెట్టడం అంటే అది వారి గోప్యతను హరించడమే అని కొందరి అభిప్రాయం. ప్రజల వ్యక్తిగత సమాచారంపై ప్రభుత్వ పెత్తనం పెరుగుతుందని, ఇది ఓరకంగా ప్రజల్లో అభద్రతాభావం పెరగడానికి దోహదపడుతుందని మరికొందరి ఆలోచన. ఈ విషయంగా డిజిటల్ హక్కుల సంఘాలు స్పందిస్తూ...ఈ యాప్ ద్వారా ప్రభుత్వం నెటిజన్ల స్వేచ్ఛను బలిచేస్తోందని ఘాటుగా విమర్శించాయి. ఈ విషయంగా రాజకీయ దుమారంకూడా రేగుతోంది. కాంగ్రెస్ తదితర విపక్షాలు కేంద్ర వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నాయి. సంచార్ సాథీ యాప్ వల్ల ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం లేకపోలేదని, ఇప్పటికే కేంద్రం నిఘా పెరిగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకూ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. స్మార్ట్ ఫోన్ సైబర్ సెక్యూరిటీ అంటే...ఫోన్లపై దాడి చేసే హాకింగ్, మాల్ వేర్, డేటా లీక్ తదితర ప్రమాదాల నుంచి మొబైల్ పరికరాన్ని పరిరక్షించడం. ఇవాళ రేపు మన లావాదేవీలు మొత్తం డిజిటలైజేషన్ అయిపోయిన నేపథ్యంలో వ్యవహారం అంతా మొబైల్ మీదుగానే సాగుతోంది. బ్యాంకింగ్ అయినా, పేమెంట్లయినా, మనీ ట్రాన్స్ ఫర్ అయినా, మన విలువైన కాంటాక్ట్ డేటా అయినా అన్నీ మనకు ముఖ్యమే. ఈ డేటా సురక్షితంగా ఉంచడమే సైబర్ సెక్యూరిటీ కర్తవ్యం. అందుకే సంచార్ సాథీ యాప్ ను కేంద్రం ప్రతిపాదించింది.

ఈ సంచార్ సాథీ యాప్ ను కేంద్రం ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఇప్పటి దాకా 37 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైళ్ళను బ్లాక్ చేయగలిగారు. అంతేకాదు పోగొట్టుకున్న 7 లక్షల పోన్లను రికవరీ చేయగలిగారు. అయితే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి పోవడం అన్న విషయాన్నే ప్రజలు జీర్ణించుకోలేరు కాబట్టే ఈ యాప్ పై ఆందోళన వ్యక్తం చేశారు. పనిలోపనిగా విపక్షాలకు మంచి టాపిక్ దొరికింది కాబట్టి రెచ్చిపోయారు. సరే ఇంత వివాదం అవుతున్నప్పుడు తప్పనిసరి అని ఎందుకు అది ప్రజల ఇష్టానిష్టాలకే వదిలేద్దాం అని కేంద్రం నిర్ణయించుకుని బెట్టు సడలించి మెట్టు దిగి యాప్ తప్పనిసరేం కాదు అని ప్రకటించింది.

Tags:    

Similar News