మోడీ చేతిలో సనాతన ధర్మాస్త్రం... డిఫెన్స్ లో ఇండియా కూటమి ?

సనాతన ధర్మం అంటే భారత్ అని ఇక్కడ నేల నీరు, గాలి ప్రకృతి అన్నీ అందులో భాగమని బీజేపీ ప్రచారం చేయబోతోంది;

Update: 2023-09-14 01:30 GMT

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించే అస్త్రాలు చాలానే ఉండొచ్చు. అవన్నీ కూడా భావోద్వేగాలకు సంబంధించిన అస్త్రాలే కావడం కూడా గమనించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇండియా అన్న పేరుని భారత్ గా మార్చి 143 కోట్ల మంది మదిలో ఒక్క పైసా ఖర్చు లేకుండా గర్వాన్ని పెంపొందిచే కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టబోతోంది అని అంటున్నారు. నేనూ నా దేశం భారత్ అనుకుంటూ ప్రతీ పౌరుడూ తలెత్తుకుని నిలబడేలా చేశామని ఇక మీదట బీజేపీ ప్రచారం మొదలెట్టవచ్చు అంటున్నారు.

అలాగే ఇపుడు మరో అంశాన్ని కూడా బీజేపీ అమ్ముల పొదిలో పెట్టుకుంటోంది. అయితే ఇది బీజేపీ మేధోమధనంలో పుట్టినది కానే కాదు. విపక్ష కూటమి ఇచ్చిన చాన్స్ ని అందిపుచ్చుకుని బీజేపీ తిప్పికొట్టబోతోంది. తమిళనాడు డీఎంకే మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్ ఇపుడు బీజేపీకి ఆయుధాలుగా మారబోతున్నాయి.

సనాతన ధర్మం అంటే భారత్ అని ఇక్కడ నేల నీరు, గాలి ప్రకృతి అన్నీ అందులో భాగమని బీజేపీ ప్రచారం చేయబోతోంది. ఈ నేలనే అవమానించేల డీఎంకే చేసిన కామెంట్స్ ఉన్నాయంటూ ఏకంగా ఇండియా కూటమికే దాన్ని చుట్టేసి బీజేపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సనాతనధర్మం మీద ఇండియా కూటమికి విశ్వాసం లేదంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

దేశంలో సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ఇండియా కూటమి తలపెడుతోందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఈ దేశం జాతిపితగా చెప్పుకునే మహాత్మాగాంధీ, అలాగే ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానందుడు, లోక్ మాన్య తిలక్ వంటి వారు సనాతన ధర్మాన్నే ప్రేరణగా తీసుకున్నారని మోడీ అనడం ద్వారా భారతీయ మూలాలను ఎక్కడో టచ్ చేశారు.

మహనీయులు, దేశానికి పూజ్యనీయులు అనుసరించిన బాటనే ఇండియా కూటమి తప్పుపడుతోంది అంటూ మోడీ చెబుతున్నారు. రాబోయే రోజులలో సనాతన ధర్మం మీద ఇండియా కూటమి నేతలు దాడులు చేస్తారని మోడీ అనండం విశేషంగా చూడాలి. సనాతన ధర్మాన్ని పాటించే వారు, ప్రేమించే వారు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మోడీ ఇచ్చిన పిలుపు ఇండియా కూటమి మీద చేసిన తొలి పెను సవాల్ గానే భావించాలని అంటున్నారు.

మోడీ ఇచ్చిన ఈ పిలుపు ఇపుడు ఇండియా కూటమిని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసేలా ఉంది అని అంటున్నారు. ఒక వైపు చూస్తే ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యల మీద ఎక్కడా తగ్గడంలేదు. పైగా ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు. ఆయన తండ్రి తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కుమారుడిని సమర్ధిస్తున్నారు. ఇక ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా కాంగ్రెస్ కి సన్నిహిత పార్టీగా డీఎంకే ఉంది. దాంతో డీఎంకే తీరుని తప్పుపట్టే సాహసం ఇండియా కూటమి నేతలు ఎవరూ గట్టిగా చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అయితే ఇప్పటిదాకా దీని మీద ఏ కామెంట్స్ చేయలేదు.

మొత్తానికి ఇండియా కూటమికి సంకట పరిస్థితిని కల్పించాలన్నదే మోడీ తాజా వ్యాఖ్యల సారాంశం అని అంటున్నారు. రానున్న రోజులలో బీజేపీ దీన్ని ప్రధాన అజెండాగా చేసుకుని ఇండియా కూటమిని చీల్చిచెండాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దేశంలో నూటికి ఎనభై శాతానికి పైగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. వారిలో సగం మంది బీజేపీ ఇచ్చిన పిలుపుకు రియాక్ట్ అయినా 2024 ఎన్నికలో మరోసారి గెలిచి బీజేపీ హ్యాట్రిక్ కొట్టినట్లే అంటున్నారు.

మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలతో చాలా వరకూ డ్యామేజ్ కంట్రోల్ కి చాన్స్ ఉంటుంది. కానీ ఆయన ఆ పని చేయరని తేలిపోతోంది. తమిళనాడు వరకు డీఎంకే ఆలోచనలు ఉన్నాయి. అక్కడ తమ స్లోగన్ హిట్ అవుతుందని వారు నమ్ముతున్నారు. ఇండియా కూటమికి మాత్రం డీఎంకే వారసుడు బిగ్ ట్రబుల్స్ తెచ్చె లాగానే ఉన్నారని అంటున్నారు.చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News