కొత్త సీఎస్ గా సాయిప్రసాద్.. ఫిబ్రవరి వరకు విజయానంద్ కు చాన్స్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-11-30 09:30 GMT

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకూ సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఆయన రిటైర్మెంట్ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిగా ప్రస్తత జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది మార్చి 1న ఆయన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

వాస్తవానికి నవంబరు 30న సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు సీఎస్ విజయానంద్ పదవిలో కొనసాగుతారు. ఇక విజయానంద్ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతున్న సాయిప్రసాద్ 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 1992లో వరంగల్ జాయింట్ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లు కేంద్ర సర్వీసుల్లో కూడా సాయి ప్రసాద్ పనిచేశారు.

ఇక కొత్త సీఎస్ కానున్న సాయిప్రసాద్ వచ్చే ఏడాది మే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ గ్రాడ్యుయేట్ అయిన సాయిప్రసాద్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) చీఫ్ కమిషనరుగా ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేశారు. ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ హోదాలోనూ కొన్నాళ్లు సేవలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహిత అధికారిగా సాయిప్రసాద్ ను చెబుతారు.

కాగా, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారులు తర్వాత సీఎస్ లుగా పదోన్నతులు పొందడం ఆసక్తి రేపుతోంది. గతంలో సీఎస్ లుగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్, కేఎస్ జవహర్ రెడ్డి కూడా గతంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శలుగా పనిచేస్తూ సీఎస్ లుగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.సాయిప్రసాద్‌ తాజాగా సీఎ్‌సగా నియమితులయ్యారు. ఒకే శాఖ.. ఒకే గది.. నుంచి ముగ్గురు సీఎస్‌లు అయ్యారని ఐఏఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ గది ప్రత్యేక సెంటిమెంట్‌గా మారుతుందేమోనని కొందరు ఐఏఎస్‌లు అంటున్నారు.

Tags:    

Similar News