ఆరేళ్ల పిల్లాడు దేవుడు ఎవరంటే మీరేం చెబుతారు? సివిల్స్ టాపర్ ఆన్సర్ ఇదే

దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేయటం అంత తేలికైన విషయం కాదు.;

Update: 2025-04-28 04:31 GMT

దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేయటం అంత తేలికైన విషయం కాదు. మొత్తం మూడు అంచల్లో సాగే ఈ పరీక్షలో దేనికదే సంక్లిష్టం. దీన్ని అధిగమించేందుకు చాలానే కష్టపడాలి. ఎంతో శ్రమించాలి. ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలి. అన్నింటికి మించి ఈ అంకంలో చివరిదైన ఇంటర్వ్యూను సరైన పద్దతిలో డీల్ చేయటం అంత తేలికైనది కాదు. ఆ మాటకు వస్తే ప్రిలిమ్స్.. మొయిన్స్ లో మంచి మార్కులు సాధించినా.. ఐదుగురు సభ్యులు ఉండే ఇంటర్వ్యూను సరైన పద్దతిలో డీల్ చేయకపోతే.. అప్పటి వరకు పడిన శ్రమ బూడిద లో పోసిన పన్నీరే.

నిజానికి ఈ ఎగ్జామ్ లో అన్నింటికి మించిన కఠినమైనది ఇంటర్వ్యూనే. ఏ ప్రశ్నను ఎవరు అడుగుతారో.. అంచనాలకు అందని రీతిలో ఉంటుంది. మరి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది టాపర్ గా నిలిచిన వరంగల్ అమ్మాయి సాయిశివాని అనుభవం ఏమిటి; ఇంటర్వ్యూ వేళలో ఆమెకు ఎదురైన ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటి? వాటికి ఆమె చెప్పిన సమాధానాలు ఏమిటి? అన్నది చూస్తే..

ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 11వ ర్యాంక్ ను సాధించిన ఆమె తన మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ ను కూడా దాటలేదు. కానీ.. చేసిన తప్పుల్ని గ్రహించి.. తనను తాను సరిదిద్దుకోవటంతో ఆమె విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె నేపథ్యాన్ని చూస్తే.. తండ్రి మెడికల్ రిప్రజెంటటివ్.. తల్లి ఇంట్లోనే ఉంటారు. వరంగల్ లోని ఖిలా వరంగల్ అయినప్పటికి పది వరకు ఖమ్మంలో.. ఇంటర్, బీటెక్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదివారు. చెల్లెలు సీఏ.. తమ్ముడు ఇంజినీరింగ్ చదువుతున్నారు.

ఇంటర్వ్యూ అయ్యాక తాను కచ్ఛితంగా టాప్ 50లో ఉంటానని అంచనా వేసుకున్నప్పటికి.. అందుకు భిన్నంగా ఏకంగా 11 ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్ గా నిలిచారు.మూడేళ్ల కష్టంతో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రిలిమ్స్ వేళ రోజూ 6-8 గంటలు, మొయిన్స్ వేళ రోజుకు 13-14 గంటలు ప్రిపేర్ అయ్యేవారు. ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన ప్రశ్నలు.. ఎలాంటి వాతావరణం ఉందన్నది ఆమె మాటల్లోనే చదివితే..

‘‘ఇంటర్వ్యూ మొత్తం 30-35 నిమిషాల పాటు సాగింది. తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రాలైన పోచంపల్లి.. గద్వాల.. సిరిసిల్లల గురించి అడిగితే చెప్పాను. కరెంట్ ఆఫైర్స్ గురించి అడుగుతారని అనుకున్నా. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. తొమ్మిదో తరగతిలో భగవద్గీత శ్లోకాల పఠనంలో ప్రథమ స్థానం రావటం.. యోగా.. వేస్టేజ్ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ తయారీ లాంటి అభిరుచుల గురించి నా డీటెయిల్డ్ అనలిటికల్ ఫామ్ లో రాశాను. ఆ అంశాల మీదే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ సందర్భంగా అడిగిన కీలక ప్రశ్న విషయానికి వస్తే.. ఆరేళ్ల పిల్లాడు దేవుడు ఎవరంటే ఏం చెబుతారు? అని ప్రశ్నించారు. తన చిన్నతనంలో అమ్మానాన్నలు.. అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పిన దాని ప్రకారం దేవుడికి ప్రత్యేక రూపం లేదని.. ప్రతి మనిషీ జీవిత అనుభవాల నుంచే ఆధ్యాత్మిక వాతావరణంలోకి వస్తారని చెప్పినట్లు వెల్లడించారు.

మరో కీలకమైన ప్రశ్న విషయానికి వస్తే.. ‘మీరు చదివిన భగవద్గీత ప్రకారం ప్రతి యుగంలోనూ దేవుడు వస్తాడు, సంభవామి యుగేయుగే కదా.. మరి ప్రస్తుతం ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు రావట్లేదు’ అని ప్రశ్నించగా.. ‘సమాజంలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఎంతోకొంత మంచితనం ఉంటుంది. అవసరమైన వారికి సరైన సమయంలో కావాల్సిన సహాయం చేస్తే బాధితులకు సహాయం చేసేవారు దేవుడితోనే సమానం. దేవుడు ఎక్కడినుంచో రానక్కర్లేదు. సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితోనే సమానం’ అని బదులిచ్చా. విజయానికి దగ్గరి దారులు లేవని.. క్రమశిక్షణ.. కఠిన శ్రమ.. రోజువారీ లక్ష్యాలతో చదవటం.. లక్ష్యంపై ఫోకస్ తప్ప ఇతర విషయాల జోలికి వెళ్లనప్పుడే సాధించగలమని చెప్పారు.

Tags:    

Similar News