సాక్షాత్తు ఆ క్రికెట్ దేవుడే.. సత్యసాయిబాబాకు పరమ భక్తుడు
ఎక్కడో ముంబైలో పుట్టిపెరిగిన సచిన్ కు ఏపీలోని పుట్టపర్తితో ఎంతో అనుబంధం. సత్యసాయితో అంతకుమించిన ప్రగాఢ అనుబంధం.;
భారత దేశంలో క్రికెట్ ఒక మతం అయితే అందులో ఏకైక దేవుడు అతడు...! భారత దేశంలోని కోట్లమంది క్రికెట్ అభిమానులు ఆయనకు భక్తులు.. ప్రపంచంలోని క్రికెట్ ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఆయన ఒక దైవ స్వరూపుడు..! కానీ, ఆయన మాత్రం బాబాకు పమర భక్తుడు. తండ్రి చనిపోయిన అత్యంత బాధలోనూ, మ్యాచ్ లు ఓడిపోయిన కష్టంలోనూ బాబాను తలచుకునే సాంత్వన పొందేవారు. అంతేకాదు.. ఆ బాబా పరమపదించినప్పుడు వెక్కివెక్కి ఏడ్చారు. దశాబ్దాల పాటు క్రికెట్ మైదానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా వీసమెత్తు కూడా చలించని ఆ దిగ్గజ క్రికెటర్.. ఒక ఆధ్యాత్మికవేత్త మరణం విషయంలో ఇంతగా స్పందిస్తారా? అని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆ పరమ భక్తుడు సచిన్ టెండూల్కర్ అయితే.. ఆయన ఇంతగా ఆరాధించేది పుట్టపర్తి సత్య సాయిబాబా. ఎక్కడో ముంబైలో పుట్టిపెరిగిన సచిన్ కు ఏపీలోని పుట్టపర్తితో ఎంతో అనుబంధం. సత్యసాయితో అంతకుమించిన ప్రగాఢ అనుబంధం.
పుట్టపర్తిలో అంతర్జాతీయ క్రీడా మైదానం..
దాదాపు 30 ఏళ్ల కిందటే ఉమ్మడి ఏపీలోని పుట్టపర్తిలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానం నిర్మాణమైంది. దీంట్లో అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లు కూడా మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో పాల్గొన్నాడు సచిన్ టెండూల్కర్. కేవలం సత్యసాయి బాబా మీద ఉన్న అపార భక్తితోనే సచిన్ స్థాయి ఆటగాడు మ్యాచ్ ఆడాడు. దీన్నిబట్టే బాబా అంటే ఆయనకు ఉన్న భక్తి ప్రపత్తులు ఏపాటిదో స్పష్టమవుతోంది. ఇక 2011లో సత్యసాయి మరణంతో పుట్టపర్తి వచ్చిన సచిన్... తనకు ఎంతో ఆరాధ్యుడైన బాబాను తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ సీన్ మొత్తం క్రీడా ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది.
బాబా శత జయంతికి హాజరు..
ఏపీలో నాలుగేళ్ల కిందటే శ్రీసత్యసాయి బాబా పేరిటే పుట్టపర్తి కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటైంది. తాజాగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సచిన్ హాజరయ్యారు. బాబాతో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు. ఓ సందర్భంలో తనతో బాబా సంభాషిస్తూ, ప్రజలను జడ్జ్ చేయడం కాదు.. వారిని అర్ధం చేసుకోవాలని, తద్వారా చాలా సమస్యలు తొలగుతాయని ఉపదేశించినట్లు తెలిపాడు. శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యమూ కీలకం అని బాబా చెప్పేవారని పేర్కొన్నాడు. ప్రజలకు ఆరోగ్యకర జీవనం అందించేందుకు పాటుపడ్డారని కొనియాడారు.
ప్రపంచం కప్ సమయంలో బాబా ఫోన్
2011 వన్డే ప్రపంచ కప్ సమయంలో బెంగళూరులో ఉన్న తనకు సత్యసాయి ఫోన్ చేశారని సచిన్ వివరించాడు. తర్వాత పుస్తకం పంపారని.. అది పాజిటివ్ వైబ్ కలిగించిందని అన్నాడు. అనంతరం టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిచిందని గుర్తుచేశాడు. తన జీవితంలో అదొక గోల్డెన్ మూమెంట్ గా అభివర్ణించాడు. కాగా, సత్యసాయితో సచిన్ అనుబంధం దశాబ్దాల పాటు కొనసాగింది. అనేక సందర్భాల్లో సచిన్ నేరుగా పుట్టపర్తి వచ్చేవాడు. సత్యసాయిని కలిసేవాడు. కెరీర్ లో క్లిష్ట సమయాల్లోనూ బాబా ఆశీస్సులు పొందేవాడు. అలా వ్యక్తిగతంగా ఉన్న సాన్నిహిత్యమే బాబా మరణం అనంతరం సచిన్ ను ఎంతగానో బాధించేలా చేసింది.