మోదీజీకి హృతిక్ ప్రియురాలు విలువైన సలహా!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రియురాలు, మ్యుజీషియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సబా ఆజాద్.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రియురాలు, మ్యుజీషియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సబా ఆజాద్. కళారంగంలోనే కాకుండా సామాజిక అంశాలపై ముఖ్యంగా యువత భవిష్యత్తు , విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పులపై ఎప్పుడూ పరిణతి చెందిన ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న సబా ఆజాద్ ప్రస్తుత జనరేషన్‌కు అత్యంత అవసరమైన ముఖ్యమైన సామాజిక విద్యా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నేటి ఆధునిక కాలంలో పాఠశాల స్థాయి నుండే పిల్లలకు పుస్తకాల్లోని చదువుతో పాటు సమాజం జీవితంపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా దేశంలోని అన్ని స్కూళ్లలో ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్, కుటుంబ జీవిత విద్యను తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేర్చాలని గట్టిగా డిమాండ్ చేశారు. సమాజంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, బాధ్యతలు , నైతిక విలువలను పెంపొందించడానికి ఈ తరహా విద్యా విధానం ఎంతో దోహదపడుతుందని వివరించారు. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, మారుతున్న మానవ సంబంధాల నేపథ్యంలో.. ఈ రకమైన అవగాహన కొందరికే పరిమితం కాకూడదని సబా స్పష్టం చేశారు. `ఈ అవగాహన విద్య అనేది సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా అందడం ఎంతో అవసరం. అప్పుడే సమాజంలో నేరాలు తగ్గడంతో పాటు, ఒకరినొకరు గౌరవించుకునే తత్వం, ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ , మానసిక పరిపక్వత చిన్నతనం నుండే అలవడతాయి` అని సబా ఆజాద్ ఎంతో లోతుగా విశ్లేషించారు.
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ , సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు చాలా చిన్న వయసులోనే బాహ్య ప్రపంచానికి ఎక్స్‌పోజ్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన గైడెన్స్ లేకపోతే యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని, అందుకే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు కలిసి పిల్లలకు జీవిత పాఠాలను, సున్నితమైన అంశాలపై శాస్త్రీయమైన అవగాహనను కల్పించాల్సిన బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు మార్కులు, ర్యాంకుల కోసమే కాకుండా సమాజానికి మంచి పౌరుడిని అందించేలా ఉండాలని కోరారు. ఇలాంటి సున్నితమైన , ప్రగతిశీల అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడటం పట్ల నెటిజన్లు , సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సినిమాల ప్రమోషన్లకే పరిమితం కాకుండా ఇలాంటి సామాజిక విద్యా విధానాల గురించి మాట్లాడటం సమాజంలో మంచి మార్పుకు సంకేతమని కొనియాడుతున్నారు.
పాఠశాల విద్యా ప్రణాళికలో మార్పులు రావాలంటూ సబా ఆజాద్ చేసిన ఈ ప్రతిపాదన విద్యా రంగ నిపుణులను సైతం ఆలోచింపజేసేలా ఉంది. కేవలం అకడమిక్ చదువులే కాకుండా జీవితాన్ని, కుటుంబ బంధాలను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పే ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్ నేటి తరానికి నిజంగానే శ్రీరామరక్ష. మరి సబా ఆజాద్ పెట్టిన ప్రపోజల్ పై దేశంలోని ప్రధానమంత్రి, విద్యామండళ్లు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయో చూడాలి