ట్రంప్ వర్సెస్ పుతిన్: తగ్గేదేలేదు.. ఆరునెలల్లో తెలుస్తుంది..!

అవును... ఉక్రెయిన్‌ తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-24 05:02 GMT

రష్యా - ఉక్రెయిన్ మధ్య అవిరామంగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని, అది తన చేతులమీద జరగాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జెలెన్ స్కీ కాస్త మాట వింటున్నట్లే కనిపిస్తున్నా.. పుతిన్ మాత్రం తన కండిషన్స్ కి ఒప్పుకుంటేనే శాంతి ఒప్పందం అని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ట్రంప్ సీరియస్ ఆలోచన చేశారు. అయినప్పటికీ పుతిన్ తగ్గేదే లేదు అని అంటున్నారు.

అవును... ఉక్రెయిన్‌ తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలు రాస్‌ నెఫ్ట్, లుకాయిల్‌ లపై ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు. వాటికి అనుబంధంగా పని చేసే డజన్ల కొద్దీ కంపెనీలపైనా ఈ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు.

తగ్గేదేలేదంటున్న పుతిన్!:

అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఈ సందర్భంగా... తమపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఆంక్షలను విధించిందని.. అయితే, ఆత్మ గౌరవమున్న ఏ దేశమూ ఇలాంటి బయటి ఒత్తిళ్లకు తలొగ్గబోదని.. రష్యాలాంటి దేశం ఇలాంటి విషయాల్లో మరింత గట్టిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

'పుతిన్ కు ఆరునెలల్లో అర్ధమవుతుంది'!:

తమ దేశ చమురు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షల ఒత్తిడికి తలొగ్గేది లేదంటూ పుతిన్ చేసిన ప్రకటన అనంతరం ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... ఆంక్షల విధింపు స్నేహపూర్వక చర్య కాదని పుతిన్‌ భావించడం తనకు సంతోషంగా ఉందని.. తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలల్లో వారికి అర్థమవుతుందని అన్నారు.

రష్యాపై ఈయూ ఆర్ధిక ఆంక్షలు!:

ఓ పక్క తమ దేశంలోని చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన వేళ.. మరో వైపు యురోపియన్ యూనియన్ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిచింది. ఇందులో భాగంగా... ఇక నుంచీ రష్యా ఎల్పీజీని ఈయూ దేశాలు దిగుమతి చేసుకోబోవు అని తెలిపింది. దీంతో... సుమారు 550 పైచిలుకు చమురు షాడో నౌకలు నిషేధం పరిధిలోకి వస్తాయి.

ఇది జెలెన్ స్కీ విజయం!:

ఓ పక్క చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు, మరోపక్క ఈయూ ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యాపై తీవ్ర ఒత్తిడి పెరగనుందని అంటున్నారు. అయితే.. ఇది కచ్చితంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీకి పెద్ద ఊరటగా, మరోవైపు పెద్ద విజయంగా భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి రష్యాపై ఒత్తిడి తెచ్చే విషయంలో అంతర్జాతీయ సమాజంపై ఎంతోకాలంగా జెలెన్ స్కీ ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో అమెరికా, ఈయూ నుంచి రష్యాకు వరుస షాక్ లు తగలడంతో ఆయన స్పందించారు. ఇందులో భాగంగా... దేవుడు కరుణించాడని.. దీనికోసమే తాము ఎదురుచూస్తున్నామని.. ఈ ఆంక్షలు పని చేస్తాయని తెలిపారు.

Tags:    

Similar News