ఆరోగ్య శ్రీలో కడుపుమంట కల్యాణ్ కు చికిత్స: రోజా
జనసేన ఆధ్వర్యంలో జరిగిన గాజువాక బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను రోజా తీవ్రంగా ఖండించారు. జగన్ పై పవన్ కు ఎంత కడుపు మంట ఉందో నిన్నటి సభలో స్పష్టంగా అర్థమైందని, జగన్ అంటే పవన్ కు ఎంతో జెలసీనో తెలిసొచ్చిందని రోజా అన్నారు.
జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి పవన్ సహించలేకపోతున్నారని, భూమి పేలిపోయి రుషికొండ అందులోకి వెళ్లాలని, అందులో జగన్ సమాధి కావాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రోజా దుయ్యబట్టారు.
ఇలా, అరిచి అరిచి పవన్ గుండె పగిలి చచ్చిపోతాడేమో అని భయమేస్తుందని రోజా చురకలంటించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కడుపు మంట కళ్యాణ్ గా ఆస్పత్రిలో పవన్ కు చికిత్స చేయించాలని జగన్ ను కోరతామన్నారు. అప్పటికీ కడుపు మంట చల్లారక పోతే హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో పవన్ పిచ్చికి చికిత్స చేయిస్తామని చెప్పుకొచ్చారు.
అమరావతిలో చంద్రబాబు బినామీల భూముల రేట్లు పడిపోతాయి అన్న భయంతోనే రుషికొండపై పవన్ విషయం చెబుతున్నాడని ఆరోపించారు. జగన్ వెళ్లేందుకు సొంత నియోజకవర్గం పులివెందుల ఉందని, పవన్ కు ఏ నియోజకవర్గం ఉందని ప్రశ్నించారు.
పవన్ కు ఏపీలో సొంత ఇల్లు కూడా లేదని, ఆయనో పార్ట్ టైం పొలిటిషియన్ అని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని జోస్యం చెప్పారు. ఇలా ఎండల్లో తిరిగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ప్రజలతో రాళ్ల దెబ్బలు తప్ప ఏమీ రాదని, అదే, షూటింగులు చేసుకుంటే కనీసం డబ్బులు అయినా వస్తాయని హితబోధ చేశారు. టిడ్కో ఇళ్ల ముందు ఏ మొహం పెట్టుకొని పప్పు లోకేష్, పప్పు చంద్రబాబు సెల్ఫీలు దిగారని రోజా ఎద్దేవా చేశారు.
ఇక, పవన్ గుండెపగిలి చస్తాడేమో అని భయపడున్నానంటూ రోజా చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పవన్ పై రోజాకు ఎంత ప్రేమ? అంటూ పవన్ ఫ్యాన్స్ రోజాను ట్రోల్ చేస్తున్నారు.