'ఆ టైపు క్యారెక్టర్ నాది కాదు'... రోజా కీలక వ్యాఖ్యలు!
గత కొంతకాలంగా.. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, తదనంతర పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అసహనం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.;
గత కొంతకాలంగా.. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, తదనంతర పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అసహనం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సొంత పార్టీ నేతలపైనే ఆమె విరుచుకుపడుతున్నారు. దీంతో అప్పుడప్పుడూ దీనికి సంబంధించిన బాంబులు పేలుతుంటుంటాయి! ఈ క్రమంలో సంక్రాంతి సంబరాల వేళ ఆర్కే రోజాకు.. రాజకీయాలను వదిలేస్తున్నారా అనే ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
అవును... మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలోని తన నివాసం వద్ద భోగి సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని.. రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదని.. రైతులకు 20వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో... రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని దివంగత వైఎస్సార్ తో పాటు వైఎస్ జగన్ నమ్మారని.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని.. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వారికి మేలు చేస్తున్నారని చెబుతూ... మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే... తాను రాజకీయాలను వదిలేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి రోజా ఖండించారు. ఇందులో భాగంగా... ఓడిపోతే భయపడి పారిపోయే క్యారెక్టర్ తనది కాదని చెబుతూ.. రెండు సార్లు ఓడిన తర్వాతే ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తాను మంత్రి అయ్యాకే షూటింగ్స్ ఆపేశానని.. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమాలు, షోలు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా ఇటీవల రోజా సొంత పార్టీ పెద్దలపై ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలో... వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్, మరికొందరు నేతలపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అప్రతిష్టపాలు చేయడానికే నగరిలో సొంత పార్టీలోనే పెద్ద నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే!