బియ్యం కేజీ వంద...ఏమి తిని బతకాలి ?

ఈ దేశంలో ఇప్పటిదాకా అన్నానికి కొరత అయితే లేదు, ఎందుకంటే అవసరానికి మించి ధాన్యం పంట పండుతూ వచ్చింది.

Update: 2026-10-08 03:30 GMT

బియ్యం కేజీ వంద రూపాయలు మార్క్ దాటుతోంది. ఇది నిజంగా ఆశ్చర్య పరచే విషయంగానే చూడాలి. ఎంత ధరలు పెరిగినా బియ్యం విషయంలో ఆ దూకుడు ఎపుడూ కనిపించలేదు, ఇపుడు ఎల్ నినో పుణ్యామని హద్దులు దాటేస్తోంది. బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చుక్కలు కనిపిస్తాయని చెప్పడమే తప్ప చూసినది అనుభవంలోకి వచ్చినదీ లేదు, కానీ ఇపుడు అచ్చంగా అదే పరిస్థితి ఉంది. సామాన్యుడుకి మధ్యతరగతికి చుక్కలే పట్టపగలే కనిపిస్తున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలను చూసి బడుగు జీవులు ఠారెత్తుతున్నారు. ఏమి కొనేటట్టు లేదు ఏమి తినేటట్లు లేదు అన్నది మళ్లీ పాడుకోవాల్సిన దారుణమైన పరిస్థితులు వచ్చేశాయి.

వేంగంగా సెంచరీకి :

ఈ రోజున మార్కెట్ లో చూస్తే బియ్యం ధరలు బంగారం ధరలతో పోటీ పడుతున్నాయి. బంగారం అయితే మోజు తగ్గించుకుంటారు, కొనడం మానేసుకుంటారు. కానీ బియ్యం ధరలు పెరిగితే ఎలా. ఇంట్లో పొయ్యి మీద గిన్నెలో బియ్యం ఉడికేది ఎలా. ఇది కదా సాధారణ జనం వేదన. సాధారణ సన్నబియ్యం ధరలు కూడా పరుగులు తీస్తూ పట్టుకోమని సవాల్ విసురుతున్నాయి. ఎక్కడో కాదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దాంతో సంచి డబ్బులతో బజారు కెళ్ళి జేబులకు సరిపడ సరుకు తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

అన్నమో రామచంద్రాయేనా :

ఈ దేశంలో ఇప్పటిదాకా అన్నానికి కొరత అయితే లేదు, ఎందుకంటే అవసరానికి మించి ధాన్యం పంట పండుతూ వచ్చింది. చాలా సందర్భాలలో వరి పండించవద్దు అని పాలకులే సూచించే నేపథ్యం ఉంది. కానీ ఈసారి అలా కాదు, ఎల్ నినో ప్రభావంతో ఒక్కసారిగా దిగుబడి తగ్గిపోయింది. దాంతో ధరలు కూడా పెరిగిపోతున్నాయి. సాధారణ సన్న బియ్యం ధర చూస్తే గత నాలుగు నెలల క్రితం కిలో యాభై రూపాయల నుంచి 55 గా ఉంటే ఇపుడు అది ఏకంగా 85 రూపాయల దాకా ఎగబాకేసింది. దాంతో బియ్యం ధరను చూస్తే షాక్ తినాల్సి వస్తోంది అని సాదర జనం గోడు పెడుతున్నారు. ఇక తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలలో పండుగ సీజన్ నాటికి కొన్ని రకాల బియ్యం ధరలు కిలో ఏకంగా వంద రూపాయలు దాటే అవకాశం ఉందని మిల్లు యజమానులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బాస్మతి వంటి ప్రీమియం రకాల ధరలు ఇప్పటికే కిలో 130 నుండి 240 పైనే పలుకుతున్నాయి.

కష్టమే మరి :

ఇంతలా ధరలు పెరగడానికి కారణం ఏమిటి అన్నది చూస్తే దిగుబడి తగ్గడం అన జవాబు వస్తోంది. ఎల్‌నీనో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు విస్తీర్ణం తగ్గి దిగుబడి పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అలాగే మార్కెట్‌లో ధాన్యం నిల్వలు తగ్గడంతో ఓపెన్ మార్కెట్‌లో మిల్లు యజమానులు ఎక్కువ ధర పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగా చెబుతున్నారు. ఎరువులు, కూలీల ఖర్చులు రవాణా ఛార్జీలు పెరగడం కూడా రిటైల్ ధరలపై ప్రభావం చూపుతోంది అని అంటున్నారు. ప్రభుత్వాలు అయితే సగటు రేటును నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు, బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన సన్నబియ్యం ధరలు మాత్రం వంద మార్క్ ని తాకేస్తున్నాయి. దీంతో గంజి నీళ్ళకు అయినా గతి ఉంటుందా అన్నది సామాన్యుడు వేస్తున్న ప్రశ్న.

Tags:    

Similar News