బాబు రిక్వెస్ట్ : ఎల్ నినోకి కేంద్రం ఆర్థిక సాయం ?
ఎల్ నినో అన్నది ప్రపంచ సమస్యగా ఉంది. చాలా దేశాలు 2026లో ఎల్ నినో చిక్కుల్లో పడి నలిగిపోతున్నాయి.
ఎల్ నినో అన్నది ప్రపంచ సమస్యగా ఉంది. చాలా దేశాలు 2026లో ఎల్ నినో చిక్కుల్లో పడి నలిగిపోతున్నాయి. భారత్ వరకూ చూసుకుంటే ఏకంగా 12 రాష్ట్రాలలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడిన ఈ ఉగ్రరూపం, భారతదేశంలోని నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దెబ్బకు వానలు కూడా అసలు లేకుండా పోయాయి. తీవ్రమైన వర్షాభావం దేశం మొత్తాన్ని వెంటాడింది. ఎన్నడూ లేని విధంగా దేశంలో ఈ ఏడాది వర్షపాతం దశాబ్ద కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
తీవ్రమైన దుర్భిక్షంతో :
ఇదిలా ఉంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ భారత వాతావరణ శాఖ వేరు వేరుగా విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 200 నుండి 315 జిల్లాలలో తీవ్రమైన కరవు ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా చూస్తుంటే మధ్య పశ్చిమ భారత్ లో ఈ ప్రభావం అధికంగా ఉంది. మహారాష్ట్రలోని మారఠ్వాడా ప్రాంతం, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్. అదే విధంగా వాయువ్య భారతంలోని రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ. దక్షిణ భారతంలోని ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తూర్పు భారతంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశలలో ఎల్ నినో దారుణమైన పరిస్థితులకు దారి తీస్తోంది. దీని వల్ల వ్యవసాయ సంక్షోభంతో పాటు 2. తీవ్రమైన నీటి కొరత, ఆహార ద్రవ్యోల్బణం, అసాధారణ వేడి వంటి విపరీతమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
మరింతగా పెరిగి :
ఇక ఎల్ నినో కాస్తా సూపర్ ఎల్ నినోగా మరింత పెరగనుంది అని అంటున్నారు. దాంతో రాబోయే శీతాకాలంలో చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 2027 వేసవిలో రికార్డు స్థాయి వేడి పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాంతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఎల్ నినో ప్రభావంతో పెను సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ విషయం మీద కేంద్రం అయితే ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఇది కూడా ప్రకృతి విపత్తుగానే పరిగణించాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ అయితే ఎల్ నినోతో తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది.
బాబు వినతి :
ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో ఆర్థిక పరిస్థితి, గోదావరి కావేరి నదుల అనుసంధానం, గోదావరి పుష్కరాలకు నిధులు, పోలవరం ప్రాజెక్ట్, ఏపీలో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని సమాచారం. అదే విధనగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్, పీయూష్ గోయల్, శర్బానంద్ సోనోవాల్ లతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఆయన ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన ఆర్ధికపరమైన అంశాలను చర్చించారు. ఇక కేంద్ర పెద్దలతో బాబు భేటీలో ప్రధానంగా ఏపీలో ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి చర్చకు వస్తుందని అంటున్నారు. ఈ విషయాలు అన్నీ కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తారు అని అంటున్నారు. మరి ఏపీకి ఎల్ నినో సాయం కేంద్రం చేస్తుందా అన్నదే చూడాల్సి ఉంది. ఏపీకి చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేయాల్సి ఉంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా దీని మీద ఒక పాలసీని కేంద్రం నిర్ణయించే చాన్స్ ఉందని అంటున్నారు.