అయ్యా.. కొంచెం ఆ పాస్‌వర్డ్ ఏందో చెప్తే వాడుకుంటాం.. ఐఫోన్ ఓనర్ కు కొట్టేసిన దొంగ కాల్
నెల రోజుల క్రితం ఒక మహిళకు చెందిన ఖరీదైన ఐఫోన్‌ను సదరు దొంగగారు చాలా కష్టపడి నొక్కేశారు. "అబ్బా భారీ స్కెచ్ ఫలించింది, మంచి రేటు వస్తుంది" అని సంబరపడిపోయాడు.
దొంగతనం చేయడం ఒక ఎత్తైతే.. దాన్ని సరిగ్గా ‘మెయింటెన్’ చేయడం ఇంకో ఎత్తు.. స్మార్ట్‌ఫోన్ దొంగిలించడం.. సిమ్ కార్డు తీసి డస్ట్‌బిన్‌లో వేయడం.. డేటా డిలీట్ చేసి మార్కెట్లో అమ్ముకోవడం.. ఇదీ ఏ సగటు దొంగ అయినా అనుసరించే సాధారణ ప్రోటోకాల్. కానీ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒక వినూత్న ఆలోచనపరుడైన దొంగ మాత్రం ఈ ట్రెండ్‌ను తిరగరాశాడు.
నెల రోజుల క్రితం ఒక మహిళకు చెందిన ఖరీదైన ఐఫోన్‌ను సదరు దొంగగారు చాలా కష్టపడి నొక్కేశారు. "అబ్బా భారీ స్కెచ్ ఫలించింది, మంచి రేటు వస్తుంది" అని సంబరపడిపోయాడు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. యాపిల్ కంపెనీ వాళ్లు ఇచ్చిన సెక్యూరిటీని ఛేదించడం మనోడి వల్ల కాలేదు. రోజులు గడిచాయి.. నెల కూడా పూర్తయింది. లోకల్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్ మేధావులందరి వద్దకు తిరిగినా ఆ ఐఫోన్ లాక్ మాత్రం బైపాస్ కాలేదు. అటు వాడలేక.. ఇటు అమ్ముకోలేక ఆ ఫోన్ చేతిలో ఉంటే చేతిలో పైసా రాలేదు సదా సస్పెన్స్ తప్ప.. చివరకు విసిగి వేసారిపోయిన ఆ దొంగ ప్రపంచ దొంగతనాల చరిత్రలోనే ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా ఆ ఐఫోన్ అసలు ఓనర్ కే ఫోన్ చేసి “ఏమండీ.. ఆ ఫోన్ పాస్‌వర్డ్ ఏంటో చెప్తే కాస్త అన్‌లాక్ చేసుకుంటాం” అని అడిగాడు. అంతేకాదు ఫోన్ తిరిగి ఇచ్చేయమని ఓనర్ ప్రాధేయపడితే.. “ఆగండి ఆగండి ముందు ఈ ఫోన్ మీదేనని గ్యారెంటీ ఏంటి? కొన్ని వివరాలు పంపి కన్ఫర్మేషన్ ఇవ్వండి” అంటూ రివర్స్‌లో ఓనర్‌కే ‘కస్టమర్ వెరిఫికేషన్’ షాక్ ఇచ్చాడు.
ఐఫోన్ దొంగిలించినోడే దాని ఓనర్‌కు వెరిఫికేషన్ ప్రక్రియ పెట్టడం చూసి బాధితురాలితో పాటు నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. "దొంగతనంలో కూడా ఇంత కస్టమర్ సర్వీస్, పారదర్శకత ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది" అని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
అయితే ఈ ఘటన ఐఫోన్ సెక్యూరిటీ ఎంత దారుణంగా బలంగా ఉందో మరోసారి నిరూపించింది. పాస్‌కోడ్ లేకపోతే ఐఫోన్ కేవలం ఒక ఖరీదైన ‘ఇటుక’తో సమానమని తేలిపోయింది. ఏది ఏమైనా అపరిచిత వ్యక్తులు కాల్ చేసి పాస్‌వర్డ్, ఓటీపీలు అడిగితే ఇవ్వకూడదని.. వెంటనే పోలీసులను ఆశ్రయించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి లాక్ తీయలేక ఓనర్‌కే కాల్ చేసిన ఈ అమాయక దొంగ ఉదంతం ఇప్పుడు నెట్టింట నవ్వుల పువ్వులు పూయిస్తోంది.