ఇండియా బెస్ట్ స్టార్లు సినిమాల‌తో ప‌ని లేకుండా సంపాదనాప‌రులు!

తరతరాలుగా సినిమాల ద్వారా సంపాదిస్తున్న సినీహీరోలు ఇప్పుడు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ సంపదను రకరకాల రంగాలలోకి విస్తరిస్తున్నారు

Update: 2026-10-08 03:48 GMT

తరతరాలుగా సినిమాల ద్వారా సంపాదిస్తున్న సినీహీరోలు ఇప్పుడు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ సంపదను రకరకాల రంగాలలోకి విస్తరిస్తున్నారు. కేవలం సినిమాల ద్వారా వ‌చ్చే వేతనాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకే పరిమితం కాకుండా స్టార్స్ సరికొత్త వ్యాపార మార్గాలను ఎంచుకుంటున్నారు. సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నా కానీ కొంద‌రు నిరంతరం ఆదాయం వచ్చేలా విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

ఈ పెట్టుబడి వ్యూహాలలో స్టార్టప్‌లు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. కేవలం ప్రచారం చేయడం కంటే వ్యాపారంలో వాటాలు కలిగి ఉండటానికే నటులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దీపికా పదుకొనే తన `కా ఎంటర్‌ప్రైజెస్` ద్వారా ఎపిగెమియా, బ్లూస్మార్ట్, సూపర్‌టెయిల్స్‌లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు 82°E అనే సొంత బ్రాండ్‌ను ప్రారంభించారు. అలియా భట్ పిల్లల దుస్తుల బ్రాండ్ `ఎడ్-ఎ-మమ్మా`ను నిర్మించగా.. దీనిని తర్వాత రిలయన్స్ సంస్థ తో పెద్ద మొత్తం డ‌బ్బు చెల్లించి కొనుగోలు చేసింది. అలాగే కత్రినా కైఫ్ `కే బ్యూటీ`, హృతిక్ రోషన్ `HRX` వంటి బ్రాండ్లతో మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా హృతిక్ రోషన్‌కు చెందిన ప్రముఖ యాక్టివ్‌వేర్ బ్రాండ్ HRX నికర ఆస్తుల విలువ- మార్కెట్ వాల్యుయేషన్ వందల కోట్ల రూపాయల రేంజుకు ఎదిగింది. ఇది భారతదేశంలో అత్యంత విజయవంతమైన సెలబ్రిటీ-బ్యాక్డ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

స్టార్టప్‌లతో పాటు స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగం కూడా ప్రముఖుల అత్యంత ఇష్టమైన పెట్టుబడి మార్గంగా ఉంది. ముంబైలోని బాంద్రా, అంధేరి, జుహు వంటి ఖరీదైన ప్రాంతాలలో భవనాలు, ఆఫీసులు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేసి అద్దెల రూపంలో గ్యారెంటీ ఆదాయాన్ని పొందుతున్నారు. ముంబైలోనే కాకుండా పూణే, అయోధ్య వంటి ప్రాంతాలలో కూడా ప్రముఖులు భూములు కొనుగోలు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తన ముంబై లగ్జరీ అపార్ట్‌మెంట్ల విక్రయం ద్వారా భారీ లాభాలు ఆర్జించగా.. బచ్చన్ కుటుంబం కూడా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ ఆస్తులను విస్తరించింది.

సినిమా రంగానికి వచ్చేసరికి సొంత ప్రొడక్షన్ హౌస్‌ల ద్వారా ప్రముఖులు డిజిటల్ - థియేట్రికల్ కంటెంట్‌పై పెట్టుబడి పెడుతున్నారు. షారుఖ్ ఖాన్ -రెడ్ చిల్లీస్ ఎంటర్‌టెయిన్‌మెంట్, ఫర్హాన్ అక్తర్ -ఎక్సెల్ ఎంటర్‌టెయిన్‌మెంట్, అనుష్క శర్మ -క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ సంస్థ‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం వెబ్ సిరీస్‌లు, సినిమాలను నిర్మిస్తున్నాయి. దీనివల్ల స్ట్రీమింగ్ హక్కులు-టెలివిజన్ రైట్స్-డిజిటల్ లైసెన్సింగ్ ద్వారా థియేటర్ల నుండి సినిమా వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత కూడా నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది.

ప్రముఖ నటీమణులు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సౌందర్యం, లైఫ్ స్టైల్ ఉత్పత్తుల రంగంలోనూ తమ సొంత బ్రాండ్లతో దూసుకెళ్తున్నారు. సన్నీలియోన్ తన సొంత సౌందర్య ఉత్పత్తుల (కాస్మెటిక్స్) వ్యాపారాన్ని ప్రారంభించి భారీ లాభాలు ఆర్జిస్తుండగా.. నయనతార కూడా తన సొంత స్కిన్‌కేర్ బ్రాండ్ విస్తరణలో బిజీగా ఉన్నారు. కత్రినా కైఫ్ `కే బ్యూటీ` బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లో కోట్లాది రూపాయల టర్నోవర్‌తో అగ్రగామిగా నిలవగా... దీపికా పదుకొనే తన 82°E బ్రాండ్ విస్తరణతో గ్లోబల్ మార్కెట్లో పాపులరవుతున్నారు. ఈ నటీమణుల సొంత బ్రాండ్లు అన్నీ కలిసి మార్కెట్లో వందల కోట్ల నికర ఆస్తుల విలువను కలిగి ఉండ‌టం ఆస‌క్తిక‌రం. బాలీవుడ్ - సౌత్ స్టార్లు తెలివిగా వ్యాపారాల్లో పెట్టుబ‌డుల్ని పెడుతూ దూసుకుపోతుండ‌టం ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News