బంగారం ఇప్పుడే కొనండి.. 6 నెలలు దాటితే ఇక కొనలేరట.?
| అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చే ఆరు నెలల్లో ఔన్స్ బంగారం ధర 8,000 డాలర్లకు చేరవచ్చని అమెరికన్ ఆర్థికవేత్త అల్ద డైర్ మాక్లియోడ్ అంచనా వేశారు. అదే జరిగితే భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2.38 లక్షలకు చేరవచ్చని కథనం పేర్కొంది. అయితే ఇది కేవలం అంచనా మాత్రమేనని, వడ్డీ రేట్లు, రూపాయి విలువ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి అంశాలపై ధరలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ఒకప్పుడు ఇంట్లో పెళ్లి కుదిరిందంటే.. ఎన్ని తులాల బంగారం పెడదాం? అని పెద్దలు లెక్కలేసేవారు. ఇప్పుడు పెళ్లి కుదిరిందంటే.. బంగారం కొనే బదులు ఆ డబ్బుతో ఒక ఫ్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయిస్తే పోలా? అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆకాశంలో విహరిస్తున్న పసిడి ధరలు చూసి సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే తాజాగా ఒక అమెరికన్ ఆర్థికవేత్త చేసిన వ్యాఖ్యలు ఏకంగా బులెట్ ట్రైన్లనే పరిగెత్తిస్తున్నాయి.
రాబోయే ఆరు నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 8,000 డాలర్లకు చేరుతుందని అమెరికా ఆర్థికవేత్త అల్ద డైర్ మాక్లియోడ్ ఒక సంచలన అంచనా వేశారు. ఆయన లెక్క ప్రకారం అక్కడ 8,000 డాలర్లు అయితే మన దేశంలో 10 గ్రాముల తులము బంగారం ధర అక్షరాలా రూ. 2.38 లక్షలకు చేరుతుందట..
ఈ వార్త విన్నప్పటి నుంచి మధ్యతరగతి జీవుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడే కొనండి.. ఆరు నెలలు దాటితే మీ బ్యాంకు బ్యాలెన్స్ సరిపోదు అంటూ మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తుంటే అసలు ఇప్పుడు కొనడానికే బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కడుంది స్వామీ అని సామాన్యుడు తల పట్టుకుంటున్నాడు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ మార్కెట్లను కాపాడటానికి నోట్లు ముద్రిస్తూ పోతే డాలర్ విలువ పడిపోతుందని.. అప్పుడు ప్రపంచమంతా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం బంగారం మీద పడుతుందని మాక్లియోడ్ విశ్లేషించారు. డిజిటల్ ఆస్తులను నమ్మకుండా ఫిజికల్ గోల్డ్ కొనుక్కోమని ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. కానీ మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే.. జ్యువెలరీ షాపు ముందు నుంచి నడవాలంటేనే వణుకు పుడుతోంది. షాపులోకి అడుగుపెడితే అక్కడ ఏసీ గాలి కంటే సేల్స్‌మెన్ చెప్పే రేట్లు వింటేనే చెమటలు పట్టేలా ఉన్నాయి.
ఒకవేళ నిజంగానే తులం బంగారం రూ. 2.38 లక్షలకు చేరితే.. భవిష్యత్తులో పెళ్లిళ్ల సీజన్ చాలా ఆసక్తికరంగా మారడం ఖాయం. బంధువుల పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు బంగారు ఉంగరాలు.. గొలుసులు కొనలేక.. హెచ్‌డీ క్వాలిటీలో బంగారు నగల ఫోటోలు ప్రింట్ తీయించి మంచి ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇచ్చే కొత్త సంప్రదాయం మొదలవ్వొచ్చు.. బ్యాంకుల్లో లాకర్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న ఒక్క గ్రాము బంగారాన్ని జేబులో పెట్టుకునే తిరగొచ్చు. ఆరు నెలల తర్వాత ఒక తులం బంగారం కొన్న వ్యక్తికి ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
అయితే ఇక్కడ మనకు కాస్త ఊరటనిచ్చే విషయం ఒకటుంది. ఔన్స్‌కు 8,000 డాలర్లు అనేది కేవలం ఒక ఆర్థికవేత్త అంచనా మాత్రమే.. శాసనం కాదు.. అంతర్జాతీయ వడ్డీ రేట్లు.. రూపాయి విలువ.. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. దిగుమతి సుంకాలు ఇలా ఎన్నో అంశాలపై పసిడి ధర ఆధారపడి ఉంటుంది. ధరలు పెరగొచ్చు లేదా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తగ్గనూ వచ్చు.
కాబట్టి ఆరు నెలల తర్వాత బంగారం కొనలేమేమో అన్న భయంతో ఉన్న ఆస్తులన్నీ అమ్మి బంగారం షాపుల ముందు క్యూ కట్టకండి. బంగారం ధరలు ఆకాశాన్ని తాకినా మన జేబుకు చిల్లు పడకుండా చూసుకోవడమే అసలైన ఆర్థిక సూత్రం..