యోగీ మోడీ అవుతారా.. యూపీ భారమా వరమా ?

మరో వైపు చూస్తే యూపీ బీజేపీలో వర్గ పోరు అధికంగా ఉంది అని అంటున్నారు. అంతర్గత పార్టీ సమీకరణాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు.

Update: 2026-10-08 03:23 GMT

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని రెండు సార్లు అధికారంలోకి తీసుకుని వచ్చిన డైనమిక్ లీడర్ గా యోగీ ఆదిత్యానాథ్ కి పేరు ఉంది. ఆయన ఒక దశలో దేశానికి కాబోయే ప్రధాని అన్న పేరు గడించారు. మోడీ తరువాత స్థానం ఆయనదే అని కాషాయం పార్టీలో సైతం సీరియస్ గానే చర్చ సాగింది. అయితే యోగీ ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎంపీల బలాన్ని సగానికి సగం తగ్గించేశారో నాటి నుంచి ఆయన రాజకీయ ప్రభ మెల్లగా తగ్గుతూ వస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

యోగీ చరిష్మాతోనే :

అంత మాత్రం చేత యోగీ ఏమీ కాదని ఎక్కడా లేదు. బీజేపీకి యూపీకీ ఈ రోజు కూడా యోగీనే ఆశా కిరణంగా ఉన్నారు. ముచ్చటగా మూడోసారి యూపీలో బీజేపీని గెలిపిస్తే కనుక యోగీ మరో నరేంద్ర మోడీ అవడం ఖాయం. ఆయనకు బీజేపీలో ప్రధాని అవకాశాలు మరింత పదిలంగా ఉంటాయి. 2027 మార్చిలో జరిగే యూపీ ఎన్నికల్లో యోగీ బీజేపీ విజయ తీరాలకు చేరుస్తారా అన్నదే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. యోగీ చరిష్మాతో మరోసారి యూపీ ఎన్నికలను బీజేపీ గట్టిగా ఎదుర్కోబోతోంది.

హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా :

యూపీలో మరోసారి బీజేపీని గెలిపించే బాధ్యతను అధినాయకత్వం యోగీ మీదనే పెట్టింది. అంటే 2027 ఎన్నికల్లో మరోసరి బీజేపీ గెలిస్తే ఆయన హ్యాట్రిక్ సీఎం గా ప్రమాణం చేస్తారు అన్న మాట. ఒక విధంగా అది ఆయన ఇమేజ్ ని రెట్టింపు చేసే విషయంగా ఉంటుంది. అదే సమయంలో ఆయన ప్రతిష్టకు పెను సవాల్ గా కూడా యూపీ ఎన్నికలు మారబోతున్నాయి. యూపీలో యోగీ ప్రభావం ఈ రోజుకీ గణనీయంగా ఉంది. కానీ సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి సహజంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉండడం జరుగుతుంది. అది 2024 లోక్ సభ ఎన్నికల్లో అపుడే చేదు ఫలితాలను ఈచ్చింది. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న చోట బీజేపీకి 35 లోపే దక్కాయి అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అన్న విశ్లేషణలు వినిపించాయి.

భీకర రాజకీయ పోరుగా :

ఇక యూపీలో ఈసారి బీజేపీ విజయం సాధించడం అంత సులువు అయితే కాదు, ముందే చెప్పుకున్నట్లుగా సుదీర్ఘకాలంగా పాలన చేయడం వల్ల జనాల్లో మార్పు రావాలి అన్నది బలపడుతోంది. అదే విధంగా సమాజ్ వాదీ పార్టీ బలంగా పుంజుకుంటోంది. 2012 నుంచి 2017 దాకా పాలించిన అఖిలేష్ యాదవ్ కి ఆదరణ పెరుగుతోంది. ఆయనకు రాజకీయ సామాజిక పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఆయన కూడా తన పీడీఏ పిచ్‌డా దళిత్, అల్పసంఖ్యాక్ నినాదాన్ని జనంలో పెడుతూ దానిని మరింత విస్తృతం చేశారు. పీడీఏలోని పి అంటే పండిట్ బ్రాహ్మణులు అన్న మాట. యూపీ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఇక దళితులు మైనారిటీలు కూడా ఎస్పీ ఓటు భాంక్ గా ఉన్నారు. యాదవులు ఎపుడూ ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నారు. దాంతో బీజేపీకి ఎస్పీ నుంచే అసలైన రాజకీయ సవాల్ ఎదురు అవుతుందని అంటున్నారు.

బీజేపీలో వర్గ పోరు :

మరో వైపు చూస్తే యూపీ బీజేపీలో వర్గ పోరు అధికంగా ఉంది అని అంటున్నారు. అంతర్గత పార్టీ సమీకరణాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే యోగీ పాలనలో అనుకూలతలు కూడా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ తన బుల్డోజర్ జస్టిస్ తో చాలా వర్గాలలో పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా తనకంటూ ఒక బలమైన ఇమేజ్ ని సాధించారు. ఇక యూపీలో శాంతిభద్రతల నిర్వహణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లను మళ్లీ ఆకట్టుకోవడానికి ఆయన చూస్తున్నారు.

గెలిస్తే ఢిల్లీకి :

అన్నీ కలిసి వచ్చి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మూడవసారి బీజేపీని కనుక యోగీ అధికారంలోకి తెస్తే ఆయన 2029 నాటికి ఢిల్లీకి బదిలీ అయ్యేది ఖాయమని అంటున్నారు. నేరుగా ప్రధాని పీఠానికే గురి పెడతారు అని కూడా అంచనా వేస్తున్నారు. దేశంలో యూపీ పెద్ద స్టేట్. ఎక్కువ ఎంపీలు ఉన్న రాష్ట్రం. దాంతో అక్కడ బలమైన నేతగా యోగీ నిలిచి గెలిస్తే కనుక బీజేపీలో ఆయన కచ్చితంగా మరో మోడీ అయి తీరుతారు అని అంటున్నారు. మరి ఆ మ్యాజిక్ ని యోగీ చేస్తారా లేదా అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News