సంక్రాతికి రేవంత్ కేబినెట్ మినీ విస్తరణ.. బీఆర్ఎస్, బీజేపీపై కన్ను?

ముఖ్యమంత్రి సహా 18 మంది మంత్రులకు తెలంగాణ కేబినెట్ లో అవకాశం ఉంటుంది.;

Update: 2024-01-01 11:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే నెల కావస్తోంది. ఇప్పటికే అనేక రకాల నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర చూపే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వడం.. అసెంబ్లీని హుందాగా నిర్వహించడం, శాఖల వారీగా శ్వేతప్రతాలు అనేక అంశాల్లో రేవంత్ ప్రత్యేకత చాటుతున్నారు. కాగా, డిసెంబరు 7న రేవంత్ సర్కారు వచ్చాక కొన్ని రోజులకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహా 18 మంది మంత్రులకు తెలంగాణ కేబినెట్ లో అవకాశం ఉంటుంది. ఇప్పటికే 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం కల్పించాల్సి ఉంది.

పండుగ తర్వాత ముహూర్తం

తెలంగాణ కేబినెట్ లో ఇప్పటివరకు రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రాతినిధ్యం లేదు. ఇదో విశేషమే. అంతేకాదు.. రంగారెడ్డి జిల్లాకు కూడా చోటు లేదు. దాదాపు 40 శాతం జనాభా ఉన్న ప్రాంతానికి మంత్రి ఎవరూ లేరు. నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా మంత్రులుగా ఒక్కరికీ చాన్స్ దొరకలేదు. మిగిలిన ఆరు స్థానాల్లో ఈ నాలుగు జిల్లాలకు చోటు ఇవ్వాలి. దీనికి సంక్రాంతి తర్వాత ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి మినీ విస్తరణే..?

రేవంత్ కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ అన్నిటినీ ఒకేసారి భర్తీ చేయబోవడం లేదని సమాచారం. అయితే, బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చే కొందరు నాయకుల కోసం మంత్రి పదవులను ఖాళీగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీరికోసం కనీసం ఒకటి లేదా రెండు గరిష్ఠంగా మూడు బెర్తులను ఖాళీగా ఉంచుతారనే విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో మంత్రి పదవులకు ఆశావహులు చాలామంది ఉన్నారు. ఒకేసారి ఆరు పదవులను లోక్ సభ ఎన్నికల ముంగిట భర్తీ చేస్తే ఇబ్బందులు ఎదురవొచ్చు.

మైనారిటీకి ఒకటి, హైదరాబాద్ నాయకుడికి ఒకటి

ప్రస్తుతానికి రెండు మంత్రి పదవులను ఇచ్చే అశకాశం ఉందని.. అందులో ఒకటి మైనారిటీ ఖాయమని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ బడా నాయకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఆయన కాంగ్రెస్ వ్యక్తే అయి ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అంటే ఇతర పార్టీ నాయకుడిని ఆకర్షించి మంత్రి పదవిని ఇచ్చే చాన్సున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News