జగన్ బొత్సల మధ్య గ్యాప్ పెరుగుతుందా ?
వైసీపీలో సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మీద అనుకోని రాజకీయ పిడుగు టీడీపీ నుంచి పడింది.;
వైసీపీలో సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మీద అనుకోని రాజకీయ పిడుగు టీడీపీ నుంచి పడింది. అదే ఉత్తరాంధ్రా ప్రాంతానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ హత్య వెనక జగన్ హస్తం ఉందని అనుమానాలు అప్పటి కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేసేవారు అంటూ బొత్స పేరుని తెచ్చి ఇరికించారు. దాంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ బొత్స వెక్కి వెక్కి ఏడ్చారు. నిజానికి బొత్స ప్రెస్ మీట్ లో తాను అలా అనలేదని ఖండించవచ్చు. కానీ బొత్స మాత్రం ఎన్నడూ లేని విధంగా ఎవరూ ఊహించని విధంగా ఏడుపుతోనే ప్రెస్ మీట్ ని హైలెట్ చేశారు. దీని మీద రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి.
వైఎస్సార్ ఆశీస్సులతో :
బొత్స వైయస్సార్ చలువతో ఎదిగిన నాయకుడు. ఆయనకు తొలిసారి బొబ్బిలి ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి దక్కింది అంటే ఆనాటి పీసీసీ చీఫ్ గా వైఎస్సార్ ఉండడమే కారణం అని చెబుతారు. అలా 1999 లో తొలిసారి ఎంపీగా గెలిచి చట్ట సభలో బొత్స అడుగు పెట్టారు. 2004 కి వచ్చేసరికి తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న చీపురుపల్లిని ఎంపిక చేసుకుని బొత్స తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్సార్ క్యాబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఓక్స్ వ్యాగన్ కార్ల ఇష్యూలో ఆరోపణలు రావడంతో ఆయన ఆ శాఖ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రవాణా శాఖ మంత్రిగా వైఎస్సార్ ఆయనను మంత్రివర్గంలో కొనసాగించారు అంటే అంతటి అన్యోన్యత ఆయనకు పెద్దాయన వద్ద ఉండేదని గుర్తు చేసుకుంటారు.
ఫ్లాష్ బ్యాక్ పదిలం :
ఇదిలా ఉంటే 2009లో మరోసారి బొత్స గెలిచి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టారు. కేవలం మూడు నెలలకే వైఎస్సార్ మరణించడంతో అనేక రాజకీయ సామాజిక సమీకరణల నేపధ్యంలో తనకు కూడా సీఎం చాన్స్ దక్కుతుందని బొత్స భావించారు అని అంటారు. అందుకే ఆయన అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వైఎస్సార్ కుటుంబాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు అని చెబుతారు. కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గా చాన్స్ వస్తే బొత్సని పీసీసీ చీఫ్ గా తీసుకున్నారు. ఆ హోదాలో అయన వైఎస్సార్ కుటుంబం మీద తీవ్ర విమర్శలు చేసేవారు అని అంటారు. అలా చేసిన విమర్శలు ప్రకటనలు అన్నీ పదిలంగా ఉన్నాయనే టీడీపీ నేతలు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు అన్నది కూడా బొత్స పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు అన్న మాటలనే అని మంత్రి పయ్యావుల కేశవ్ లాంటి వారు గుర్తు చేస్తున్నారు.
రాజకీయ అనివార్యత :
అయితే 2014 ఎన్నికల ముందే వైసీపీలోకి బొత్స రావాలని చూసినా కుదరలేదని అంటారు. ఇక వైసీపీ కూడా ఆయనను తీసుకోకూడదని విజయనగరం జిల్లాలో ఆల్టర్నేషన్ పాలిటిక్స్ ని చూసుకుంది అలా బొబ్బిలి రాజులు, దివంగత మాజీ మంత్రి సాంబశివరాజు, కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారితో వైసీపీ రాజకీయాలు చేస్తూ వచ్చింది. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో సామాజికంగా రాజకీయంగా బలమైన నేత అవసరం పడింది. అదే సమయంలో బొత్సకు కూడా కాంగ్రెస్ చితికిపోవడంతో వైసీపీలో చేరడం అనివార్యం అయింది అని గుర్తు చేస్తున్నారు. ఇలా బొత్స వైసీపీలో చేరాక 2019లో విజయనగరం జిల్లా మొత్తం స్వీప్ చేసింది అధికారంలోకి పార్టీ వచ్చింది. ఇలా పరస్పరం రాజకీయంగా లాభపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడినా బొత్సకు జగన్ కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన శాసన మండలిలో విపక్ష నేత పదవి కట్టబెట్టారు. నిజానికి జగన్ కి ఆ హోదా కూడా లేదని గుర్తు చేస్తున్నారు.
పాత విషయాలు తవ్వితే :
ఇలా సజావుగా అంతా సాగుతున్న నేపధ్యంలో టీడీపీ పాత విషయాలను తవ్వి తీసింది దాని వల్ల బొత్స జగన్ ల మధ్య రాజకీయ గ్యాప్ ఏర్పడుతుందని ఆశిస్తోంది అంటున్నారు. జగన్ వైఖరి చూస్తే ఆయన ఇలాంటి విషయాల్లో వ్యవహరించే తీరు ఎపుడూ చర్చగానే ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే బొత్స వెక్కి ఏడ్చారని పయ్యావుల చెప్పేశారు. ఇదిలా ఉంటే అనారోగ్యం ఇబ్బందులు ఉన్నా బొత్స తన రాజకీయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మరోసారి తన హవా చాటుకోవాలని భావిస్తున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం బొత్స విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నదే చర్చగా మారింది. బొత్స జగన్ ల మధ్య గ్యాప్ వస్తే మాత్రం అది టీడీపీ సంధించిన రాజకీయ అస్త్రం లక్ష్యం సాధించినట్లే అని అంటున్నారు.