కేసీఆర్ సంతకమే.. తెలంగాణకు శాపం: రేవంత్
ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం.. తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే.;

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం.. తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించి తీరుతామని.. ఏపీ ప్రభుత్వం తాజాగా కుండబద్దలు కొట్టింది. అయితే.. దీనిని అడ్డుకోకపోతే.. తమకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నే తాజాగా దీనిపై ఎలాంటి కార్యాచరణ ప్రారంభించాలనే విషయంపై ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీఅయ్యారు. అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చారు.
తెలంగాణకు నీటి వాటాల విషయంలో కేసీఆర్ చేసిన సంతకం శాపంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శిం చారు. నాడు కృష్ణా నది జలాల్లో.. 299 టీఎంసీలు రాష్ట్రానికి సరిపోతాయని పేర్కొంటూ.. సీఎంగా ఆయన సంతకం చేశారని.. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన సంతకమే ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారిందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంపై కూడా గతంలోనే కేసీఆర్ ఓకే చెప్పారని అన్నారు.
జగన్‌తో కేసీఆర్ మిలాఖత్ అయినప్పుడు.. గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రాజెక్టులకు ఆయన వత్తాసు పలికారని.. దానికి అనుగుణంగానే ఇప్పుడు బనకచర్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అయినా.. తాము దీనికి ఒప్పుకొనేది లేదని సీఎం స్పష్టం చేశారు. 3 వేల టీఎంసీల గోదావరి జిలాలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పిందికూడా కేసీఆరేనని.. ఇది ఏపీకి వరంగా మారిందని.. చెప్పుకొచ్చారు.
నాడు కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు మసిపూసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కవితపై పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. సుప్రీంకోర్టు వరకు అయినా.. ఈ విషయాన్ని తీసుకువెళ్లి బనకచర్ల ప్రారంభం కాకుండా ఆపే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు. తెలంగాణకు కృష్ణానది, గోదావరి నదిమాత్రమే జీవాధారమని రేవంత్ రెడ్డి చెప్పారు. వీటిని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.