బాబును బుక్ చేసిన రేవంత్.. ఇరకాటంలో ఏపీ సర్కార్
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో అధికార టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి.;
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో అధికార టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు భావిస్తున్నా, ఆయన మాటల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీంతోనే టీడీపీ వెనువెంటనే అప్రమత్తమైందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడించడమే కాకుండా, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై వివరణలు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా స్పందించకపోయినా, ఆయన తరఫున టీడీపీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేయడం చూస్తే తెలంగాణ సీఎం తన రాజకీయ గురువును ఇరకాటంలో పడేశారని విశ్లేషిస్తున్నారు.
‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని నిలిపివేస్తేనే ఏపీతో చర్చలకు వస్తాం’’ అంటూ తాను చంద్రబాబుతో చెప్పానని, తనపై గౌరవంతో ఆయన రాయలసీమ ప్రాజెక్టు నిలిపేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి మాటలు వల్ల తెలంగాణలోనే ఆయనకు రాజకీయంగా లబ్ధి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఆలోచనతోనే ఆయన అలా మాట్లాడి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల మంచి కోరే తాను ఇన్నాళ్లు ఈ విషయం బయటపెట్టలేదని, ఇప్పుడు విపక్షం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడం వల్ల బహిరంగంగా చెప్పాల్సివస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఆయన ఇలా మాట్లాడటం వల్ల ఏపీలో చంద్రబాబు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కల్పించారు. ఈ కారణంగా టీడీపీ అప్రమత్తమైందని చెబుతున్నారు.
చంద్రబాబును ఇరకాటంలో పెట్టేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ రాజకీయాల కోసం అక్కడి అధికార, ప్రతిపక్షాలు చంద్రబాబును కేంద్రంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతోంది. మరోవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతున్న ఏపీ ప్రభుత్వం కూడా ఆఘమేఘాలపై ప్రకటించింది. తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్దమని వెల్లడిస్తూ, జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టను చేపట్టారని, అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసి ప్రాజెక్టును నిలిపివేసిందని సవివరంగా ప్రకటన జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై ఎదురుదాడి చేస్తూ, రాయలసీమ ప్రాజెక్టు నిలిచిపోవడానికి రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదని, బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే కోర్టుల్లో కేసులు వేయడం వల్ల నాటి జగన్ ప్రభుత్వమే పనులు చేపట్టలేకపోయిందని చంద్రబాబు ప్రభుత్వం వివరిస్తోంది. దీనివల్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల తాను నష్టపోకుండా ఆత్మరక్షణకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో 2020లోనే కేంద్రం విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేసిందని టీడీపీ చెప్పడంతో తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య జల యుద్ధం మరో మలుపు తిప్పినట్లైందని అంటున్నారు.
2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని, ఇందులో రేవంత్ రెడ్డి ఘనత ఏమీ లేదని ఏపీ ప్రభుత్వం చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని చెప్పడమే కాకుండా, రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలు బయటపెట్టేందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.