వెలుగుమట్ల ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టిన సీఎం రేవంత్
దీని ప్రకారం చూస్తే.. మొత్తం బాధితుల్లో 412 మంది అర్హులుగా గుర్తించి.. రెండు ప్రతిపాదనలు చేసింది.;
కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రచ్చగా మారిన వెలుగుమట్ల ఇష్యూకు సీఎం రేవంత్ ఎండ్ కార్డ్ వేసేవారు. బాధితుల నిరసన జ్వాలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఎప్పటిలానే ముందు బెట్టు చేసి.. ఆందోళనల్ని పీక్స్ కు తీసుకెళ్లి.. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించటమే కాదు.. తీపికబురుతో ఇష్యూను క్లోజ్ చేసే తీరును మరోసారి రిపీట్ చేసింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిరాశ్రయులకు సంబంధించి కీలక నిర్ణయా న్ని తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి.. ఇష్యూను క్లోజ్ చేసే వరాల్ని ప్రకటించారు.
ఇందులో భాగంగా పేదలకు ఇంటిపట్టా.. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో కొందరు అర్హులు ఉన్నారన్న విషయాన్ని గుర్తించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 766 మంది బాధితులు ఉండగా.. వారిలో 412 మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. గడిచిన వారం రోజులుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూదాన్ భూముల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో అసలుసిసలు అర్హులు ఎవరన్న దానిపై ప్రత్యేక సర్వేను నిర్వహించారు.
దీని ప్రకారం చూస్తే.. మొత్తం బాధితుల్లో 412 మంది అర్హులుగా గుర్తించి.. రెండు ప్రతిపాదనలు చేసింది. ఈ 412 మందిలో 311 మందికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాజాగా తీసుకున్న నిర్ణయాల్ని వేగంగా అమలు చేసే క్రమంలో భాగంగా.. అర్హులను పిలిచి రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు.
మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి దీన్ని ఆసక్తికరం అనే కన్నా.. సీఎం రేవంత్ రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పాలి. పీటముడి పడి.. పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలకు కారణమైన వెలుగుమట్ల నిరాశ్రయుల మనసుల్ని దోచేలా వరాల్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్.. బుధవారం వారికి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు తుమ్మల.. పొంగులేటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అంటే.. పీటముడి పడితే.. దాన్ని విప్పిన సీఎం రేవంత్.. బాధితులకు పట్టాలు అందించే సంతోష కార్యక్రమాన్ని సదరు జిల్లాకు చెందిన ముఖ్యనేతలకు అప్పజెప్పిన తనదైన చతురతను సీఎం ప్రదర్శించారని చెప్పకతప్పదు.