ఈగో లేని ప్రజా ప్రభుత్వం.. ఫ్రూవ్ చేసిన రేవంత్ సర్కార్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అధికారం తమకే సొంతమని భావించిన కాంగ్రెస్ అతివిశ్వాసానికి తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పవర్ కు దూరంగా ఉంచి.. నేల మీదకు తీసుకురావటం తెలిసిందే.;
దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా కాంగ్రెస్ పార్టీ తీరు కాస్త వేరుగా ఉంటుంది. ఈ పార్టీకి ఉన్న ప్రత్యేక గుణం ఏమంటే.. అధికారం చేతిలో ఉన్న సందర్భాల్లో ఎంత అధ్వానంగా పాలిస్తారో.. మరికొన్నిసార్లు అంచనాకు అందని రీతిలో వ్యవహరిస్తూ.. సర్కారు నడపటంలో ఇంత టాలెంట్ ఉంటుందా? అన్న భావనకు గురి చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అధికారం తమకే సొంతమని భావించిన కాంగ్రెస్ అతివిశ్వాసానికి తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పవర్ కు దూరంగా ఉంచి.. నేల మీదకు తీసుకురావటం తెలిసిందే.
అదే సమయంలో పదేళ్లు తమ చేతికి అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల మనోభావాల్నిఅర్థం చేసుకునే విషయంలో కేసీఆర్ ఏ మాత్రం వేరుగా ఆలోచించినా పరిస్థితులు మరోలా ఉండేవి. అధికారం తమ చేతికి రావటానికి తెలంగాణ ప్రజల నిర్ణయం కంటే కూడా వారిని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో తనకున్న టాలెంట్ వేరే లెవల్ అన్నట్లుగా కేసీఆర్ ఫీలయ్యేవారు. నిజానికి అదే.. ఆయన చేతిలో ఉన్న అధికారం దూరం అయ్యేలా చేసిందని చెప్పాలి. ఎప్పుడైతే నేల మీద నుంచి ఆకాశంలో విహరిస్తూ.. తనకు మించినోళ్లు మరెవరూ ఉండరన్నట్లుగా వ్యవహరిస్తూ.. దాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రదర్శించిన కేసీఆర్ అహంకారం తెలంగాణ ప్రజలకు ఒళ్లు మండేలా చేసింది. అంతే.. దెబ్బకు అధికార పీఠాలు మారిపోయాయి.
తాము చేసిన ఒప్పుల కంటే కేసీఆర్ చేసిన తప్పులే ఎక్కువగా ఉండటంతోనే తమ చేతికి అధికారం వచ్చిందన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తించినా గుర్తించలేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి మాత్రం పక్కాగా గుర్తించారని చెప్పాలి. అందుకు తగ్గట్లే..తమ సర్కారుకు ప్రజా ప్రభుత్వం అన్న పేరును పెట్టి.. దానికి జస్టిఫికేషన్ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించటం కనిపిస్తుంటుంది. పదేళ్ల పాటు సాగిన కేసీఆర్ సర్కారు హయాంలో ఎవరైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. సమ్మె మాటను మాట్లాడితే.. వారి విషయంలో కేసీఆర్ ఎలా వ్యవహరించే వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇందుకు భిన్నంగా ప్రజాప్రభుత్వం అన్న ట్యాగ్ లైన్ తో నడిపిస్తున్న ప్రభుత్వంలో.. తమ డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తూ.. సమ్మెకు దిగినవారిని శాంతింపచేయటమే కాదు..వారి డిమాండ్లను సకాలంగా తీర్చేలా వడివడి నిర్ణయాలు తీసుకోవటంలో ప్రదర్శిస్తున్న వేగం ప్రజల మనసుల్ని టచ్ చేసేలా చేస్తోంది. సోమవారం నుంచి సమ్మెకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల డిమాండ్ ను రోజు వ్యవధిలో పరిష్కరించటమే దీనికి నిదర్శనంగా చెప్పాలి.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని చెల్లించాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన వెయ్యికి పైగా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో రేవంత్ సర్కారు ఆదివారం చర్చలు షురూ చేసినా.. సోమవారం మరింత వేగవంతం చేయటం.. సాయంత్రానికి సానుకూలంగా ముగిసేలా నిర్ణయం తీసుకోవటం జరిగిపోయింది.ఇప్పటికే విడుదల చేసిన టోకెన్లకు సంబంధించిన రూ.600 కోట్లను దీపావళి నాటికి విడుదల చేసేందుకు సర్కారు ఓకే చెప్పటంతో రోజులో సమ్మె ముగిసిపోయింది.
మిగిలిన బకాయిల్ని సైతం కాస్త ఆగి చెల్లిస్తామని చెప్పటంతో.. సమ్మెకు చెల్లుచీటి ప్రకటించేశారు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు. ఇదంతా చూస్తున్న వారు ప్రజాప్రభుత్వానికి.. గతంలో ఉన్న ఈగో సర్కారుకు మధ్య తేడా ఇదేనని స్పష్టం చేస్తున్నారు. తమకు ఇగో లేదని చెప్పే ముఖ్యమంత్రి మాటలు అక్షర సత్యంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వాల్ని నడిపే క్రమంలో సమస్యలు ఎదురైనా..వాటికి మరిన్ని చిక్కుముడులు పడకుండా.. సత్వరమే సమస్యకు పరిష్కారం లభించేలా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.