అరెస్టు లేదంటూనే ఫాంహౌస్ లో మానవ మృగాలు మాటేంది రేవంత్?

కొన్నిసార్లు లాగి పెట్టి ఒక్కటి పీకినా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. అందుకు భిన్నంగా మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసే విద్య కొందరిలో మొండుగా ఉంటుంది.;

Update: 2025-08-26 04:38 GMT

కొన్నిసార్లు లాగి పెట్టి ఒక్కటి పీకినా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. అందుకు భిన్నంగా మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసే విద్య కొందరిలో మొండుగా ఉంటుంది. అలాంటి టాలెంట్ ఉన్నోళ్లు తెలంగాణ రాజకీయాల్లో కొదవ లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కొడుకు కేటీఆర్.. కుమార్తె కవిత.. మేనల్లుడు హరీశ్ రావులు మాత్రమే కాదు.. వీళ్లందరిలోని కొన్ని టాలెంట్లను మిక్స్ చేస్తే ఒక్కటిగా కనిపించేటోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చేతలతో చర్యల కన్నా.. నోటి మాటతో అంతకు మించిన నొప్పిని కలిగించే టాలెంట్ తెలంగాణ సీఎంకు ఎక్కువనే చెప్పాలి.

అవకాశం వచ్చిన ఏ సందర్భాన్ని విడిచి పెట్టకుండా విరుచుకుపడే వైనం ఆయనకు ఎక్కువే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచె గచ్చిబౌలి భూముల ఎపిసోడ్ లో.. ఏఐతో రూపొందించిన వీడియో ప్రజల్ని మాత్రమే కాదు కొన్ని వ్యవస్థల్ని సైతం ఎంతలా ప్రభావితం చేశాయో ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు సైతం సీరియస్ గా తీసుకున్న ఈ వైనంలో ప్రభుత్వ విభాగాల వైఫ్యలం కూడా తక్కువేం కాదు. విపక్షం వ్యూహాత్మకంగా కంచెగచ్చిబౌలి ఎపిసోడ్ ను టేకప్ చేస్తే.. అందుకు తగ్గట్లుగా అంతే ఎఫెక్టుతో కౌంటర్ ఇవ్వటానికి బదులుగా.. అప్పట్లో డిఫెన్సులో పడిన పరిస్థితి.

కట్ చేస్తే.. కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ లో తన ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నాం చేశారన్న ఆగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ లో కాస్త ఎక్కువే. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఆయన సదరు అంశాన్ని ప్రస్తావిస్తూ.. తీవ్రమైన కౌంటర్ వేస్తూ ఉంటారు. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం తన ప్రసంగంలో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గతంతో పోలిస్తే.. ఈసారి డోసు పెంచి తన ఆగ్రహాన్ని బయటపెట్టేశారు.

సెంట్రల్ వర్సిటీలో ఏనుగులు.. సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని ఆరోపించిన ఆయన.. ‘‘వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారు. కానీ తెలంగాణలో ఏనుగులు.. సింహాలు లేవు. మానవ రూపంలో మృగాలు ఉన్నాయి. అవి ఫాంహౌస్ లో ఉన్నాయి. వాటిని పట్టుకొని బంధించాలి’’ అంటూ తాను చెప్పాల్సిన మాటల్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారు.

ఆసక్తికర అంశం ఏమంటే.. ఫాంహౌస్ లో మానవ మృగాలు అన్నది ఎవరిని ఉద్దేశించో అందరికి తెలిసిందే. అయితే.. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అని అడిగిన సందర్భంలో మాత్రం ఇప్పుడు అన్నంత క్లారిటీగానే.. అప్పట్లోనే అరెస్టులు లాంటి చర్యలు ఉండవని.. ప్రజాక్షేత్రంలో వారికి ఎదురైన ఓటమే.. అతి పెద్ద శిక్ష అని.. ఇప్పటికే ఫాంహౌస్ అనే జైల్లో ఉంటున్నట్లుగా రేవంత్ వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఓవైపు చర్యలు ఉండవంటూనే.. మరోవైపు వాటిని బంధించాలంటూ చేస్తున్న సీఎం వ్యాఖ్యల పరంపరను చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని స్పష్టమవుతుంది. అలా అని సమకాలీన రాజకీయాల్లో మాదిరి ప్రతీకారాలు చేతల్లో లేకుండా.. మాటలకే పరిమితం చేయాలన్న వ్యూహం సీఎం రేవంత్ మాటల్లో స్పష్టమవుతుందని చెప్పాలి. ఏమైనా.. రాజకీయ ప్రత్యర్థుల్ని మాటలతో పోట్లు పొడిచే టాలెంట్ సీఎం రేవంత్ కు ఎంత ఎక్కువన్నది మరోసారి నిరూపితమైందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News