మోడీ మాకు పెద్దన్న...రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి అన్నది తెలిసిందే. ఆయన రాజకీయ వ్యూహాలు కూడా బాగానే ఉంటాయి.;
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి అన్నది తెలిసిందే. ఆయన రాజకీయ వ్యూహాలు కూడా బాగానే ఉంటాయి. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో పార్టీ ప్రభుత్వం మధ్య విభజన ఎలా ఉండాలో కూడా ఆయనకు చక్కగా తెలుసు అని అనేక సందర్భాలలో రుజువు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమంలో తాజాగా పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నరేంద్ర మోడీ మా అందరికీ పెద్దన్న అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా అందరూ అంటే దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు అని ఆయన చెప్పారు అన్న మాట.
సీఎం గా మోడీ :
ఇక ఆయన చెప్పిన మరో విషయం ఏంటి అంటే దేశానికి ఈ రోజున ప్రధానిగా మోడీ ఉన్నా ఆయన కూడా గుజరాత్ కి సీఎం గా పనిచేశారు, కేంద్రం మద్దతు రాష్ట్రాలకు ఎంత అవసరం స్వయంగా మోడీకి సైతం తెలుసు అని అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర సాయం కావాలని కేంద్ర మంత్రి మోడీ కేబినెట్ సహచరుడు అయిన మనోహర్ లాల్ కట్టర్ సమక్షంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటూ తగిన సహాయం అందించాలని ఆయన కోరుకున్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీ బ్యూటిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ సిస్టం వీటి విషయంలో కేంద్రం నుంది ఇతోధిక సహాయం తో పాటు భారీగా నిధులు అవసరం ఉంది. అందుకే పెద్దన్న మోడీ తెలంగాణా ప్రగతి పట్ల పెద్ద ప్రేమను చూపించాలని రేవంత్ రెడ్డి కోరారు అన్న మాట.
నిజాయితీతో కూడిన వినతి :
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి నిజాయతీతో కూడిన విన్నపమే కేంద్రానికి చేశారు అని అంటున్నారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజకీయాలను మధ్యలోకి తీసుకుని రావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఇబ్బందిలో పడుతుంది. అయితే రేవంత్ రెడ్డి పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్న తీరునే మొదటి నుంచి సాగుతున్నారు. ఆయన ఢిల్లీ ఎపుడు వెళ్ళినా ప్రధాని మోడీని కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అంతే కాదు పెద్దన్నగా ఉంటూ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విన్నపాలు చేస్తూ వస్తున్నారు దీని మీద రాజకీయంగా ఎవరు ఏమి అనుకున్నా రేవంత్ చెప్పేది ఒక్కటే సీఎం గా కేంద్రం సాయం కోసం తప్పనిసరిగా అడిగి తీరాల్సిందే అని. అందులో తప్పు కూడా లేదు.
మోడీకి సూచనగానే :
ఈ రోజున రాజకీయాలు కూడా మారిపోయాయి. తమ పార్టీ పాలిత రాష్ట్రాల పట్ల ఒకింత ఎక్కువ ప్రేమ విపక్ష రాష్ట్రాల పట్ల వేరే విధంగా వ్యవహరించే తీరు కనిపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ఈ అప్పీల్ చేసి ఉంటారని అంటున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని సమాఖ్య స్పూర్తి ఇదేనని చెప్పేలా ఆయన మోడీని పెద్దన్నగా చేశారు అని అంటున్నారు. అదే విధంగా రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి, కేంద్రం నుంచి అడిగి తీసుకోవచ్చు, ఒక్కోసారి డిమాండ్ చేయవచ్చు, అయితే డిమాండ్లు పెట్టి రాజకీయంగా ముందుకు పోతే దక్కేది ఏమిటో కూడా తెలుసు. అందుకే ఆయన ఫెడరల్ స్పూర్తినే ఎమోషనల్ దారిలో చెబుతూ పెద్దన్న మీరు అని మోడీని ముందు పెట్టారు అని అంటున్నారు.
హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి :
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అయితే రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన వంతు పాత్ర పోషిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. పైగా రాష్ట్రం కోసం ఒక ప్రతిపక్ష సీఎం ఈ విధంగా నిజయాతీతో కూడిన విన్నపం చేయడం సైతం కేంద్ర మంత్రిని ఆకట్టుకుంది అని అంటున్నారు. పైగా రాష్ట్ర అవసరాల కోసం సీఎం హోదాలో డిమాండ్ చేయడం హక్కుల కోసం పోరాటం చేయడం బాధ్యత కూడా. మొత్తానికి మోడీ మాకు పెద్దన్న అంటే విపక్షం ఏమి అనుకున్నా రేవంత్ యాంగిల్ లో అయితే ఫెడరల్ సిస్టం లో చెప్పినట్లే అని అంటున్నారు.