తెర‌పైకి తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌.. ఫైర్ బ్రాండ్ కు చాన్స్!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 27 నెల‌లు అవుతోంది. అంటే, స‌గం కాలం పూర్తిచేసుకుంది.;

Update: 2026-03-20 17:30 GMT

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 27 నెల‌లు అవుతోంది. అంటే, స‌గం కాలం పూర్తిచేసుకుంది. మిగిలింది మ‌రో రెండున్న‌రేళ్లు మాత్ర‌మే అన్న‌మాట‌. ఇప్ప‌టికీ, కీల‌క‌మైన హోం, విద్యా శాఖ‌లు సీఎం రేవంత్ రెడ్డి వ‌ద్ద‌నే ఉన్నాయి. అస‌లు ఒక రాష్ట్రంలో హోం మంత్రి (శాఖ సీఎం వ‌ద్ద ఉన్నా స‌రే) లేకుండా రెండున్న‌రేళ్లు ప్ర‌భుత్వం న‌డ‌వ‌డం కాస్త అరుదే. అయితే, అటు ప్ర‌తిప‌క్షం నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ గ‌ట్టిగా నోరు తెరిచి అడిగే వారు లేనందున, అధిష్ఠానం కూడా దీనిని ఒక అంశంగా ప‌రిగ‌ణించ‌నందున అంతా సాఫీగా సాగిపోతోంది. రేవంత్ త‌న‌దైన శైలిలో మూసీ ప్ర‌క్షాళ‌న‌, ఫోర్త్ సిటీ అంటూ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్నారు. ఇక 2023 డిసెంబ‌రులో రేవంత్ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక‌.. 2025 జూన్ లో కేబినెట్ ను విస్త‌రించారు. మంత్రులుగా గ‌డ్డం వివేక్, వాకిటి శ్రీహ‌రి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ల‌కు బెర్తులు ద‌క్కాయి. దీంతో సీఎంతో క‌లిపి మంత్రుల సంఖ్య 15కు చేరింది. మ‌రో ముగ్గురికి చాన్సుంది.

కొత్త‌గా ఎవ‌రు? ఇద్ద‌రిపై వేటు

రెండున్న‌రేళ్లు మాత్ర‌మే ఉన్నందున ఎన్నిక‌ల నాటికి పూర్తిస్థాయి కేబినెట్ తో వెళ్ల‌డం స‌రైన‌ది అని విశ్లేష‌కుల మాట‌. ఈ లెక్క‌న తెలంగాణ కేబినెట్ ను విస్త‌రించ‌నున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఎమ్మెల్సీగా నియ‌మితురాలైన సినీ న‌టి, ఫైర్ బ్రాండ్ విజ‌య శాంతికి ఈసారి మంత్రి ప‌ద‌వి ఖాయం అంటున్నారు. ఈ మేర‌కు అప్ప‌ట్లోనే ఆమెకు హామీ ఇచ్చార‌ని కూడా చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎస్సీ వ‌ర్గానికి చెందిన దామోద‌ర రాజ‌న‌ర్సింహ డిప్యూటీ సీఎంగా ఉండ‌గా, బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని కూడా డిప్యూటీ సీఎం చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇద్ద‌రిని కేబినెట్ నుంచి తొల‌గించి ముగ్గురికి చోటిస్తార‌ని పేర్కొంటున్నారు.

పీసీసీ చీఫ్ కు ఖాయం?

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉంటే.. పీసీసీ చీఫ్ కు ఎన‌లేని ప్రాధాన్యం ఉంటుంది. సీఎం త‌ర్వాత ఆ పోస్టే ప‌వ‌ర్ ఫుల్ అంటారు. ఈ క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని.. ఆయ‌న స్థానంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ను పంపుతార‌ని చెబుతున్నారు. మ‌హేశ్ కుమార్ గౌడ్ కే డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా ద‌క్కుతుంద‌ని పేర్కొంటున్నారు. కీల‌క శాఖ‌లు చూస్తున్న‌వారి మార్పులు కూడా ఉంటాయ‌ని అంచ‌నా.

అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత‌

శుక్ర‌వారం తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ అసెంబ్లీ స‌మావేశాలు పూర్త‌యిన త‌ర్వాత కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే సీఎం రేవంత్ త‌న ప్ర‌ణాళిక‌ల‌ను అధిష్ఠానం ముందు ఉంచార‌ని వివ‌రిస్తున్నారు. కొంద‌రు మంత్రుల ప‌నితీరుపై పెద‌వి విరుపు ఉంద‌ని.. వారిని త‌ప్పించి కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని కూడా అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌య్యేలా చేసిన మంత్రిని త‌ప్పించ‌డం ఖాయం అని కూడా అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News