బనకచర్ల... రేవంత్ డీల్ చేసిన తీరిది !

ఒక్కోసారి ఒక్కో ఇష్యూ తిరిగి తిరిగి అనూహ్యంగా టార్గెట్ చేయాలనుకున్న వారికే ప్లస్ అవుతుంది.;

Update: 2025-06-19 16:39 GMT

ఒక్కోసారి ఒక్కో ఇష్యూ తిరిగి తిరిగి అనూహ్యంగా టార్గెట్ చేయాలనుకున్న వారికే ప్లస్ అవుతుంది. బీఆర్ఎస్ బనకచర్ల ఇష్యూని రైజ్ చేసింది ఈ ఇష్యూ ద్వారా బహుళ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూనే రేవంత్ రెడ్డిని కార్నర్ చేసింది. రేవంత్ రెడ్డి ఒకనాడు టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి బాబు వర్సెస్ రేవంత్ రెడ్డి రచ్చ పెట్టాలనుకుంది. అది అలా కలసి వచ్చితమకే మైలేజ్ అని లెక్క వేసుకుంది.

అయితే రేవంత్ రెడ్డి చాలా విషయంలో స్పష్టంగా ఉన్నారు. గత ఏడాది ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యల విషయంలో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం తో కలసి కూర్చున్నారు. ఒకే ఒక్క భేటీ ఇద్దరి మధ్యన జరిగినా ఎవరి స్టాండ్ వారు తీసుకున్నారు. దాంతో ఆ భేటీ తర్వాత మరేమీ జరగలేదు.

ఇక్కడ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే బాబు అంటే గౌరవం ఉంది. అయితే రాష్ట్రం రాజకీయం వేరు అన్నట్టుగానే ఆయన విడమరచి చూడగలుగుతున్నారు. అందుకే బాబు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఆయన ఇదే చెబుతున్నారు. అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డిని బాబు శిష్యుడిగానే చూస్తూ వస్తున్న బీఆర్ఎస్ ఆయనకు ఇరాకాటంలో పెడుతోందని అంటున్నారు.

ఇక పోలవరం బనకచర్ల విషయం తీసుకుంటే ఇది రాజకీయ వివాదంగా తేవాల్సినది కాదనే అంటున్నారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోవాలని అనుకుంటోంది. కానీ మొత్తం గోదావరి జలాలకే ఇబ్బందులు అన్నట్లుగా చర్చ సాగుతోంది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ కి తనదైన తీరులోనే రేవంత్ రెడ్డి జవాబు ఇచ్చారు అని అంటున్నారు.

ఆయన ఏపీతో న్యాయ పోరాటానికి అయినా రెడీ అనేంతదాకా వెళ్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అసలు రాజీ లేదని కూడా అన్నారు. తెలంగాణా కోసం ఎందాకైనా అని చెబుతున్నారు. దీంతో పాటుగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు అయినా ఎవరైనా తాము పోరాడుతోంది తెలంగాణా కోసం అన్న ఆలోచనతోనే ఉంటున్నారు.

ఇక ఆయన అఖిల పక్ష సమావేశం నిర్వహించడమే కాదు హుటాహుటీన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పెద్దలను కలిశారు. ఈ విషయం మీద చర్చించారు. కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే మాత్రం తాము కోర్టులకు వెళ్తామని అంటున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ ని కూడా ఆయన గట్టిగానే కెలికారు. కేసీఆర్ జగన్ ల మధ్యనే బనకచర్ల ప్రాజెక్ట్ పుట్టిందని గోదావరిలో మూడు వేల టీఎంసీల నీరు ఉందని దానిని వాడుకోవచ్చు అని చెప్పిందే కేసీఆర్ అని కూడా ఎత్తి చూపుతున్నారు.

నదీ జలాల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు వల్లనే ఈనాటి పరిస్థితి అని అంటున్నారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ స్కీములను ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ నే ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బీజేపీని కూడా ముగ్గులోకి లాగుతున్నారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి బనకచర్ల కావాలా లేక తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలు కావాలా అని నిగ్గదీస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి తెలంగాణాలో పొత్తు పెట్టుకుని ముందుకు రావాలని చూస్తున్న బీజేపీకి ఈ విధంగా గట్టి పొలిటికల్ స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు.

మొత్తానికి చూస్తే తెలంగాణాలో తన పార్టీని విస్తరించాలని చూస్తున్న టీడీపీకి కూడా బనకచర్లతో కాళ్ళకు బంధాలు పడుతున్నాయని అంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుని ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ ఈ విషయంలో ధాటీగా రియాక్ట్ అవుతుందని ఊహించని బీఆర్ఎస్ ఇపుడు ఏమాలోచిస్తుందో చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా స్ట్రాంగ్ వాదనలతో రేవంత్ రెడ్డి అయితే తన స్టాండ్ ని జనం ముందు ఉంచారని అంటున్నారు.

Tags:    

Similar News