ఆరు పదుల వయసులో లా చదవనున్న ఏబీ వెంకటేశ్వరరావు

రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తన విశ్రాంత జీవితంలో న్యాయ విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు.;

Update: 2025-06-05 11:03 GMT

రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తన విశ్రాంత జీవితంలో న్యాయ విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. బుధవారం జరిగిన లా ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యారు. ఒంగోలు కేంద్రంగా జరిగిన పరీక్షలో ఆయన ఎంట్రన్స్ కు హాజరయిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ప్రభుత్వంలో సుమారు నాలుగేళ్లు పోస్టింగు లేకుండా నిర్లక్ష్యానికి గురైన ఏబీవీ.. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన పోలీసు హౌసింగు బోర్డు చైర్మన్ పదవిని కాదనుకున్నారు. తనను వేధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా పలు కార్యక్రమాలు చేస్తున్న ఏబీవీ న్యాయవాద విద్యను అభ్యసించాలని అనుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

దాదాపు మూడు దశాబ్దాలు పాటు పోలీసు అధికారిగా సేవలు అందించిన ఏబీవీకి చట్టం, న్యాయంపై సంపూర్ణ అవగాహన ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ న్యాయ విద్యలో డిగ్రీ లేకపోవడంతో వెలితిగా భావించిన ఏబీవీ విశ్రాంత జీవితంలో మళ్లీ చదువుకోవాలని నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన న్యాయవాద కోర్సులో చేరాలని భావించడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అనేదే ఆసక్తి రేపుతోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఏబీవీ పోస్టింగు లేకుండా వేధింపులకు గురయ్యారు. అఖిల భారత సర్వీసుల అధికారుల ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు గత ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేశారు ఏబీవీ. సంబంధం లేని కేసుల్లో ఇరికించడంతోపాటు చట్ట విరుద్ధంగా సస్పెన్షన్ విధించడంపై ఆయన సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సివచ్చింది. నాలుగేళ్ల సస్పెన్షన్ తర్వాత 2024 మే 31న ఆయన రిటైర్ అయ్యారు. కోర్టు తీర్పు మేరకు రిటైరయ్యే రోజే ఆయనకు గత ప్రభుత్వం పోస్టింగు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఏబీవీ న్యాయ విద్య అభ్యసించాలని నిర్ణయించడంపై బలమైన కారణముందని అంటున్నారు. తనకు జరిగిన అన్యాయంతోపాటు మాజీ సీఎం జగన్ హయాంలో అణచివేత, వేధింపులు, నిర్లక్ష్యానికి గురైన పలువురికి మద్దతుగా పోరాడుతానని చెబుతున్న ఏబీవీ తానే స్వయంగా న్యాయశాస్త్రం పట్టా తీసుకుని కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒంగోలులో పరీక్ష రాసిన ఏబీవీ ఏ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ.. సాధారణ విద్యార్థిలా ఆయన పరీక్ష రాయడం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది.

Tags:    

Similar News