దేశాలు మారుతున్న అత్యంత ధ‌న‌వంతులు.. కార‌ణాలివే!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ధ‌నవంతుల కుటుంబాలు త‌మ నివాస దేశాల‌ను మార్చుకోవ‌డం ఈ మ‌ధ్య బాగా ఎక్కువైపోయింది.;

Update: 2026-02-13 08:52 GMT

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ధ‌నవంతుల కుటుంబాలు త‌మ నివాస దేశాల‌ను మార్చుకోవ‌డం ఈ మ‌ధ్య బాగా ఎక్కువైపోయింది. ఒక‌ప్పుడు విదేశాల‌కు వెళ్ల‌డం వెనుక వ్యాపార అవ‌కాశాలు, ట్యాక్స్ బెనిఫిట్స్, మెరుగైన జీవ‌న‌శైలి లాంటి కార‌ణాలుండేవి కానీ ఇప్పుడు దీని వెనుక ఉద్దేశం మారింద‌ని ప‌లువురు నిపుణులు చెప్తున్నారు. రాజ‌కీయ అనిశ్చితి, విధాన మార్పులు, భ‌ద్ర‌తా ఆందోళ‌న‌లు లాంటి అంశాలు గ్లోబ‌ల్ సంప‌ద ఎక్క‌డ స్థిర‌ప‌డాల‌నే నిర్ణ‌యాన్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని CNBC రీసెంట్ గా వెల్ల‌డించింది.

రాజ‌కీయ మార్పులు, ప‌న్ను విధానాలే కార‌ణం

ఆర్థిక స‌ల‌హాదారుల ప్ర‌కారం, సంప‌న్నులు ఇప్పుడు ఒకే దేశంపై ఆధార‌ప‌డ‌కుండా, పెట్టుబ‌డుల‌ను విభిన్న ఆస్తుల్లో విస్త‌రించే విధంగా, త‌మ నివాసాల‌ను కూడా విభిన్న దేశాల్లో ఏర్పాటు చేసుకునే మార్గాన్ని అనుస‌రిస్తున్నార‌ని, రాజ‌కీయ మార్పులు, ప‌న్ను విధానాల క‌ఠిన‌త లాంటి అంశాలు వేగంగా మారుతున్న నేప‌థ్యంలో ఒకే దేశానికి ప‌రిమిత‌మ‌వ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వారు భావిస్తున్నారు.

ప్ర‌త్యామ్నాయ నివాసాల కోసం ఆలోచ‌న‌

కుటుంబ సంప‌ద‌ను, వార‌సత్వాన్ని, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను కాపాడుకోవ‌డం ఇప్పుడు వారికి మెయిన్ టార్గెట్ గా మారింద‌ని.. రాజ‌కీయ అస్థిర‌త‌, సామాజిక ఉద్రిక్త‌త‌లు, విధానాల్లో అక‌స్మాత్తుగా జ‌రిగే మార్పులు లాంటి అంశాలు సంప‌న్నుల‌ను ప్ర‌త్యామ్నాయ నివాసాల కోసం ఆలోచించేలా చేస్తున్నాయ‌ని చెప్తూ, దీన్ని గ్లోబ‌ల్ బ్యాక‌ప్ ప్లాన్ గా నిపుణులు ప‌రిగ‌ణిస్తున్నారు.

స్విట్జ‌ర్లాండ్ కు చెందిన ప్ర‌ముఖ బ్యాంక్ UBS చేసిన తాజా సర్వేలో 87 మంది బిలీయ‌నీర్ల‌లో మూడో వంతుకి పైగా 2025లో క‌నీసం ఒక‌సారైనా త‌మ నివాస దేశాన్ని మార్చుకున్న‌ట్టు వెల్ల‌డ‌వ‌గా, మ‌రొక వ‌ర్గం దేశ మార్పిడి అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని, ముఖ్యంగా 55 ఏళ్లలోపు ఉన్న బిలీయ‌న‌ర్ల‌లో ఈ ధోర‌ణి మ‌రింత బ‌లంగా క‌నిపిస్తోంద‌ని, గ‌తేడాది ఈ ఏజ్ గ్రూప్ లో దాదాపు స‌గం మంది త‌మ నివాస దేశాన్ని మార్చుకున్న‌ట్టు పేర్కొన్నారు.

గ‌త సంవ‌త్స‌రంలో పోలిస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ రెసిడెన్సీ, పౌర‌స‌త్వ కార్య‌క్ర‌మాల‌కు ద‌ర‌ఖాస్తులు దాదాపు 30% పెరిగిన‌ట్టు వెల్ల‌డైంది. మొత్తంగా చూసుకుంటే బిలీయ‌న‌ర్ల నిర్ణ‌యాల్లో రాజ‌కీయ స్థిర‌త్వం, ప‌న్నుల అనుకూల‌త‌, సేఫ్టీ లాంటి అంశాలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మారుతున్న స‌మీక‌ర‌ణాలు ఈ ధోర‌ణిని మరింత బ‌ల‌ప‌రిచే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News