బొత్స Vs లోకేశ్.. మండలిలో ఆసక్తికర వాగ్యుద్ధం

శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. విపక్షం వైసీపీ సభకు హాజరవుతుండటంతో ఆసక్తికర చర్చలకు మండలి వేదిక అవుతోంది.;

Update: 2026-02-13 10:00 GMT

శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. విపక్షం వైసీపీ సభకు హాజరవుతుండటంతో ఆసక్తికర చర్చలకు మండలి వేదిక అవుతోంది. వైసీపీ గైర్హాజరుతో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగిపోతున్నాయి. కానీ, మండలి మాత్రం నిజమైన రాజకీయ పసందుకు వేదికగా మారుతోంది. శుక్రవారం విద్యాశాఖపై జరిగిన సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ముఖ్యంగా విపక్ష నేత బొత్స సత్యానారాయణ విమర్శలకు మంత్రి లోకేశ్ దీటుగా స్పందించారు. విపక్షం వాకౌట్ పేరుతో పారిపోతోందని, సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ మాత్రం ఒక డోర్ నుంచి వెళ్లిపోయి రెండో డోరు నుంచి మళ్లీ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్ష నేత బొత్స, మంత్రి లోకేశ్ మధ్య సంవాదం రాజకీయంగా ఆసక్తి రేపింది. విద్యాశాఖపై చర్చ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ఉండిపోయాయని బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యాపారం చేశారని దీనికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని బొత్స ప్రకటించారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. వైసీపీ సభ్యులు అబద్ధాలు చెప్పి బయటకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో 70 వేల మంది ఇంటర్ విద్యార్థులు పెరిగారని చెప్పారు.

బొత్సకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని ఎదురుదాడి చేశారు. ప్రైవేటు రంగానికి దీటుగా ప్రభుత్వ కళాశాలలు పోటీ పడుతున్నాయని అన్నారు. వైసీపీ సభ్యులు చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ డోర్ నుంచి వెళ్లిపోయి టీ తాగి మళ్లీ పక్క డోర్ నుంచి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బొత్స వాకౌట్ చేస్తానని చెప్పి సభ నుంచి వెళ్లిపోతుండగా, సార్ డోర్ వెనక వైపు లేదు ఈ పక్కన ఉంది ఇటు వెళ్లండి అంటూ మంత్రి లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అదేవిధంగా ప్రతిపక్ష నేత ఆరోపణలు చేసి వెళ్లిపోతున్నారని, తాము సమధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, దయచేసి ప్రతిపక్ష నేత బొత్సను సభకు రప్పించాలంటూ మంత్రి లోకేశ్ చైర్మన్ స్థానంలో ఉన్న మోషేన్ రాజును కోరారు. అయినప్పటికీ ఫీజు బకాయిలు, ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులను నిరసిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మండలిలో వాడివేడి చర్చలే సాగుతున్నాయి. పలు అంశాలపై విపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. గురువారం కూడా విశాఖలో భూ కేటాయింపులపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం సంతృప్తికరంగా లేదని వాకౌట్ చేసింది. ఈ సన్నివేశాలను టీవీల్లోను సోషల్ మీడియాలో చూస్తున్న వీక్షకులు నిజమైన మజా అనుభవిస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News