నారా ఫ్యామిలీ పీఆర్ టూర్స్.. చంద్రబాబు 4.0 సర్కారులో ఇదే స్పెషల్!
ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0 పాలనలో వినూత్న పంథాలో కనిపిస్తున్నారు. ఆయనతోపాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా గతానికి భిన్నంగా కనిపిస్తూ కార్యకర్తలు, నాయకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0 పాలనలో వినూత్న పంథాలో కనిపిస్తున్నారు. ఆయనతోపాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా గతానికి భిన్నంగా కనిపిస్తూ కార్యకర్తలు, నాయకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్న ఆయన సహచరులతోపాటు రాజకీయ ప్రత్యర్థులు సైతం సీఎంలో కొత్తగా కనిపిస్తున్న మార్పుపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉండేవారు. సరదాగా మాట్లాడటం, ప్రజలతో ముచ్చట్లు ఆడటం అనేవి మచ్చుకైనా కనిపించేవి కావు. ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండటానికి ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు.. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడానికి సీరియస్ గా పనిచేయడానికి మాత్రమే పరిమితమయ్యే వారు. కానీ, ఇప్పుడు ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చంద్రబాబు మాత్రమే కాదు ఆయన కుటుంబంలో భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కొత్త తరహాలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకే కాదు ప్రజలతోనూ సంభాషిస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షం ఇదంతా పీఆర్ స్టంట్ గా విమర్శిస్తున్నా.. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచుతోంది. గత నలభయ్యేళ్లుగా చూస్తున్న వారు ఇప్పుడు కొత్త చంద్రబాబు కనిపిస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. నెలలో ఒకటి రెండు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతున్న సీఎం చంద్రబాబు.. గతానికి భిన్నంగా ఈ సారి ప్రజలతోనే మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడిస్తున్నారు. వారి ఫిర్యాదులు, సమస్యలు తెలుసుకుంటున్నారు. గతంలో ఇలా చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళితే ఒకరిద్దరు అధికారులను అయినా సస్పెండ్ చేసేవారు. దీంతో ఆయన ఉద్యోగులకు సింహస్వప్నంగా కనిపించేవారు. అయితే 4.0 పాలనలో చంద్రబాబు పూర్తిగా ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా మారిపోయారు. తన పర్యటనల్లో అధికారులను పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లడం తను నిర్దేశించుకున్న కార్యక్రమానికి మాత్రమే పరిమితమవుతున్నారు.
ప్రతినెలా ఫించన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. వారి ఆర్థిక వనరులు, సమస్యలను పరిష్కరించుకునే పద్ధతిపై పూర్తిగా చర్చిస్తున్నారు. అదేవిధంగా పథకాల ప్రారంభోత్సవంలోనూ పెద్దగా హంగు, ఆర్భాటం చేయడం లేదు. అన్నదాతా సుఖీభవ పథకం ప్రారంభించే సమయంలో ఆయన మండుటెండలో పొలం గట్టుపై ఒక వంద రెండొందల మంది రైతులతోనే కార్యక్రమం జరిపించారు. ఇది చూసిన వారికి కొత్తగా కనిపిస్తోంది. చంద్రబాబులో మార్పుపై ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఒకప్పుడు ఎవరైనా చంద్రబాబు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయేవారు. ఆయన చుట్టూ పటిష్టమైన భద్రతా వలయం వల్ల సామాన్యులు తమ గోడు చెప్పుకునే చాన్స్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు చంద్రబాబే తన భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చేస్తున్నారు. తన కారులో సామాన్యులను కూర్చొబెడుతున్నారు. తనే స్వయంగా టీ, కాఫీ చేసి ప్రజలను మైమరిపిస్తున్నారు. గతంలో సీరియస్ గా ఉంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు చాలా సరదా మనిషిగా మారిపోయారు. తాను హాయిగా నవ్వుతూ, అందరినీ హాయిగా నవ్విస్తూ కార్యక్రమాలను నడిపిస్తున్నారు.
ఇలా చంద్రబాబు ఒక్కరే కాదు.. ఆయన కుటుంబంలో భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి సైతం ఇదే విధంగా పబ్లిక్ రిలేషన్ పెంచుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి సాధారణ కార్యకర్తల ఇంటికి వెళ్లడం, ప్రజాదర్బార్ నిర్వహించడం, ఉచిత బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించడం విశేషంగా ఆకట్టుకుంది. గతంలో చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భువనేశ్వరి ఎప్పుడూ రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో కనిపించలేదు. కానీ, ఈ సారి ఆమెలోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆయన నియోజకవర్గం బాధ్యతలను తనే భుజానికెత్తుకున్నారు. చంద్రబాబు ప్లేసులో అన్నీతానై కార్యక్రమాలను నడిపిస్తున్నారు. మంత్రి లోకేశ్ సైతం తండ్రికి మించినట్లు ఇప్పుడు పీఆర్ పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
లోకేశ్ మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా, ప్రస్తుతం ఆయన రెండోసారి మంత్రిగా ఉన్నారు. తొలిదపా మంత్రిగా ఉన్నప్పుడు ఒకప్పటి చంద్రబాబు మాదిరిగా పూర్తిగా అధికారిక బాధ్యతలు మాత్రమే చూసుకునేవారు. కానీ, ఇప్పుడు లోకేశ్ లో చాలా మార్పు కనిపిస్తోందని అంటున్నారు. మంగళగిరిలో ఎక్కడ చూసినా లోకేశ్ మాత్రమే కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నెరవేరుస్తూనే లోకేశ్ సమయం దొరికినప్పుడల్లా సాధారణ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలతో సరదాగా మాట్లాడుతూ తాను వారికి ఆత్మీయుడును అన్న భావన కల్పిస్తున్నారు. ఆ మధ్య విజయవాడలో ఓ మహిళా కార్యకర్త పెళ్లికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు లోకేశ్. నిజానికి ఆయన ఆ వివాహానికి వెళుతున్న విషయం గంట ముందు వరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఇదే మాదిరిగా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సైతం అప్పుడప్పుడు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. స్థానిక మహిళలు, వ్యాపారులతోపాటు వివిధ వర్గాల వారితో భేటీ అవుతున్నారు. బ్రాహ్మణి చిన్నతనం నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగినా, ఎప్పుడూ ఇలా రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ, ఇప్పుడు ఆమె తన సమయంలో కొంత భాగం మంగళగిరిలో లోకేశ్ కోసం కేటాయిస్తున్నారు.
ఇలా చంద్రబాబుతోపాటు మిగిలిన కుటుంబ సభ్యులు అంతా ప్రస్తుతం ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా ప్రజాభిమానంతో రాజకీయాల్లో కొనసాగుతున్నా... ఇప్పుడు చంద్రబాబుతోసహా మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరు సమ్ థింగ్ డిఫరెంటుగా ఉంటోంది. దీని అంతటికీ కారణం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, జైలు ఎపిసోడే అంటున్నారు. దగ్గరదగ్గర రెండు నెలలు జైలులో ఉన్న చంద్రబాబు కోసం వేలాది మంది రాజమండ్రి తరలిరావడం, జైలు నుంచి విడుదలైన తర్వాల లక్షల మంది ప్రజలు రోడ్లపై ఆయన కోసం ఎదురుచూడటం చూసిన నారా కుటుంబం దృక్పథంలో పూర్తి మార్పు వచ్చిందని అంటున్నారు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యుడిగా చంద్రబాబును అక్కున చేర్చుకున్న ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ఆలోచనతో నాలుగోసారి అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ప్రజల కోణంలోనే పనిచేస్తున్నారని అంటున్నారు. ఒకవైపు టెక్నాలజీ, పెట్టుబడులు అంటూ ఉన్నతస్థాయిలో ప్రభావం చూపుతూనే.. క్షేత్రస్థాయికి దూరం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.