భార్య సీఎం-భర్త పాలన.. ఏంటి విషయం?
సాధారణంగా ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి ఎదురయ్యేది ప్రధానంగా కుటుంబ సభ్యుల సమస్యే.;
సాధారణంగా ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి ఎదురయ్యేది ప్రధానంగా కుటుంబ సభ్యుల సమస్యే. తెలంగాణలో చూసుకుంటే..సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిలో వాస్తవం ఎంత ఉందన్నది పక్కన పెడితే.. బీఆర్ ఎస్ నాయకుల నుంచి మాత్రం విమర్శలు జోరుగానే ఉన్నాయి. ఏపీ విషయంలో ఈ సమస్యలులేకుండా.. కుటుంబ సభ్యులే ప్రభుత్వం లో కీలక రోల్ పోషిస్తున్నారు.
ఢిల్లీ విషయానికి వస్తే.. కుటుంబ రాజకీయాలకు తాము దూరమని చెప్పే బీజేపీ ఈ ఏడాది జరిగిన ఎన్ని కల్లో ఇక్కడ విజయం దక్కించుకుని పాగా వేసింది. ఈ క్రమంలోనే మహిళా నాయకురాలు.. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు. పాలన పరంగా ఇంకా ఆమె కు పట్టు చిక్కినట్టు కనిపించడం లేదు. రోడ్లపై పశువులు పెరిగిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారిందని.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిని నేరుగా ఆమె పరిశీలిస్తున్నారు.
ఇక, ఇతర విషయాలను చూస్తే.. రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా.. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నూ చర్చ సాగుతోంది.తాజాగా ఆప్ నాయకురాలు , మాజీ సీఎం అతిషీ.. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఢిల్లీలో భార్య మాటున భర్త అధికారం చక్కబెడుతున్నారని ఆమె ఆరోపించారు. రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి నేరుగా ఆకార్యాలయానికే వెళ్లిన మనీష్.. అధికారులతో చర్చించారు.
ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. బీజేపీ నాయకులు కుటుంబ రాజకీయాలకు దూరమని చెబుతున్న క్రమంలో ఇలా ఢిల్లీ సీఎం భర్త నేరుగా జోక్యం చేసుకుని పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టడం అదికూడా.. సర్కారు ఏర్పడి మూడు మాసాలు కాకుండానే విమర్శలు రావడం గమనార్హం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆప్ నాయకులు.. సెటైర్లు పేలుస్తున్నారు. పశువుల పర్యవేక్షణకే సీఎం పరిమిత మవుతున్నారని..పాలనను ఆమె తన భర్త చేతిలో పెట్టారని అంటున్నారు.