ఎర్రకోటలో చోరీ అయిన కలశానికి ఇంత ప్రాముఖ్యత ఉందా? మరో రెండు ఎక్కడ?
ఢిల్లీ చరిత్రాత్మక ఎర్రకోట నుంచి ఇటీవల గజరాజ్ కలశం ఓ దుండుగుడు చోరీ చేశాడు. అయితే ఈ కలశం విలువ రూ. కోటికి పైగా ఉంటుందని పోలీసులు విచారణలో వెల్లడైంది;
ఢిల్లీ చరిత్రాత్మక ఎర్రకోట నుంచి ఇటీవల గజరాజ్ కలశం ఓ దుండుగుడు చోరీ చేశాడు. అయితే ఈ కలశం విలువ రూ. కోటికి పైగా ఉంటుందని పోలీసులు విచారణలో వెల్లడైంది. హాపూర్ (ఉత్తరప్రదేశ్) నుంచి ఆ కలశాన్ని పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కలశం జైన మతానికి చెందిన పవిత్ర ఆచారాల్లో దీనిని వినియోగించినట్లు తేలింది. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఈ కలశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తున్నది. అయితే, మరో రెండు కలశాల కోసం పోలీసులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
జైనులకు పరమ పవిత్రం
జైన మత విశ్వాసంలో గజరాజ్ కలశాన్ని ఎంతో పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. దీనిని ముఖ్యంగా శాంతి స్థాపన, పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఈ కలశం ప్రపంచ శాంతి కోసం రూపొందించారని తెలుస్తోంది. జైన మత ప్రజల దృష్టిలో, కలశం దైవ ప్రార్థన, సానుకూల శక్తి ప్రసారం, శుభయోగం, శక్తి ప్రతీకగా నిలుస్తుంది. దీనిని ఏర్పాటు చేయడం ద్వారా పూజ మరింత ఫలవంతంగా మారుతుందని జైనుల నమ్మకం.
ఆభరణాలు, నిర్మాణ లక్షణాలు
చోరీకి గురైన గజరాజ్ కలశం మొత్తం 760 గ్రాముల బంగారం , 150 గ్రాముల విలువైన వజ్రాలు, మాణిక్యాలు, పచ్చ రత్నాలు పొదిగి ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రత్యేకంగా, డైమండ్లు, పన్నీలు, మాణిక్యాలు వంటి రత్నాలు ఈ కలశం ప్రాధాన్యత, పవిత్రతను పెంచాయి. ఈ ఆభరణాలు పొదగడంతో కలశం మరింత అందంగా కనిపిస్తున్నది. .
సంఘటన నేపథ్యం
ఈ కలశం జైన్ మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తుండడంతో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ పూజ కోసం ఎర్రకోట ప్రాంగణానికి ఈ కలశాన్ని తీసుకెళ్తారని తెలుస్తోంది. కలశం చోరీ సంఘటన జైన్ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ కలశ చోరీ ఘటన కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా, మతపరమైన స్థితిగతులపై భారీ ప్రభావం చూపుతున్నది.
భక్తుల విశ్వాసాలపై ప్రభావం..
ఈ ఘటన భక్తుల విశ్వాసాలపై ప్రభావం చూపుతున్నది. మతపరమైన వస్తువులు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా, శాంతి, సమాజానికి మేలైన సంకేతంగా కూడా భావించాలి. చట్టం, నైతిక బాధ్యతలు సమన్వయం చేసుకుని, అటువంటి పవిత్ర వస్తువులను రక్షించడానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం స్పష్టమవుతోంది. మతపరమైన ఆచారాలు సుసంపన్నంగా సాగేందుకు, సామాజిక స్ధిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వ, సమాజం, మత సంఘాల మద్ధతు తప్పనిసరి.