బెంగళూరును మించి హైదరాబాద్ లో ఆర్సీబీ సంబరాలు.. వైరల్ వీడియోలు

ఇది ఒక విధంగా ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ, దీని వెనుక కారణం స్పష్టంగా ఉంది.;

Update: 2025-06-04 04:22 GMT

ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ విజయం కేవలం జట్టుదే కాదు.. ఇది కోహ్లీ, అభిమానులు, అద్భుతమైన క్రికెట్ ప్రేమికుల గుండె చప్పుడు.

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఒక సంచలనం. అతని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆటతీరు దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించిపెట్టాయి. తాజాగా జరిగిన ఐపీఎల్ ట్రోఫీ విజయం తరువాత అతని పాపులారిటీ మరో స్థాయికి చేరింది.

ఆర్సీబీ గెలుపుతో బెంగళూరు వీధులన్నీ సంబరాల వేదికలుగా మారాయి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే.. హైదరాబాద్‌లో ఈ విజయాన్ని మరింత ఉత్సాహంగా, జనసందోహం మధ్య జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే ఇది స్పష్టమవుతుంది. వీధుల్లో నృత్యాలు, బాణాసంచాలు, ఆర్సీబీ జెండాలతో ఊరేగింపులు, కోహ్లీ పేరుతో నినాదాలు… హైద‌రాబాద్ జ‌నం నిజంగా పండుగలా చేసుకున్నారు.

ఇది ఒక విధంగా ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ, దీని వెనుక కారణం స్పష్టంగా ఉంది. హైదరాబాద్‌లో కూడా విరాట్ కోహ్లీకి విశేషమైన ఫాలోయింగ్ ఉంది. అతను ఇక్కడ ఒక దేవుడులాంటి స్థాయిలో కొలవబడతాడు. అంతేకాదు, హైదరాబాద్‌లో క్రికెట్‌ను అభిమానించే ప్రజలు ఎందరో ఉన్నారు. వారికి తమ టీమ్ గెలవకపోయినా, కోహ్లీ గెలవడం ఒక ప్రత్యేక ఆనందం.

ఈ రెండు మెట్రో నగరాలు.. బెంగళూరు , హైదరాబాద్ ఈ విజయాన్ని ఒక పండుగలా మార్చాయి. ఇది కేవలం ఆర్సీబీ గెలుపే కాదు, క్రికెట్‌పై ఉన్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. ఇది క్రికెట్ ప్రేమికులందరినీ ఒకే జెండా కిందకు తీసుకొచ్చిన దృశ్యం. విరాట్ కోహ్లీ నాయకత్వ గుణాలు, ఆర్సీబీ టీమ్ త్యాగం , అభిమానుల మద్దతు కలిస్తే ఎలా విజయం సాధించవచ్చో ఇది ఓ ప్రత్యక్ష ఉదాహరణ.

ఈ విజయంతో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్, క్రికెట్ కి భారత్ లో ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువైంది. RCB గెలిచింది, కానీ అభిమానం మాత్రం దేశం అంతటా ఉంది.. ముఖ్యంగా హైదరాబాద్‌లో పతాకస్థాయికి చేరింది.!

Tags:    

Similar News