ఏడాదికి తీసేస్తున్న పాతనోట్ల లెక్క తెలిస్తే అవాక్కే!
తాజాగా రిజర్వు బ్యాంక్ వెల్లడించిన పాత.. కొత్త కరెన్సీ నోట్ల వివరాలు ఆసక్తికరంగానే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తాయని చెప్పాలి.;
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు కరెన్సీ చుట్టూనే మనిషి జీవితం తిరుగుతూ ఉంటుంది. ఏ అవసరానికైనా జేబులో నుంచి డబ్బులు తీయకుంటే ఏదీ సొంతం కాదు. కొన్నేళ్లుగా వచ్చిన డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని నోట్ల వాడకం బాగానే తగ్గింది. అయినప్పటికీ.. ఎప్పటికప్పుడు పాత నోట్లు.. నలిగిన నోట్ల స్థానే కొత్త నోట్లను తీసుకొచ్చే ప్రక్రియ నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. తాజాగా రిజర్వు బ్యాంక్ వెల్లడించిన పాత.. కొత్త కరెన్సీ నోట్ల వివరాలు ఆసక్తికరంగానే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తాయని చెప్పాలి. ప్రతి ఏడాది ఆర్ బీఐ డిస్పోజ్ చేసే పాత నోట్లు దాదాపు 2వేల కోట్లకు పైనే ఉంటాయని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 3030 కోట్ల కొత్త నోట్లు ఎంట్రీ ఇస్తే.. 2385 కోట్ల పాత నోట్లను ఆర్ బీఐ డిస్పోజ్ చేసింది. ఏడాదిలో డిస్పోజ్ అయిన నోట్ల సంఖ్య 12.27 శాతానికి పెరగటం గమనార్హం. ఏప్రిల్ - అక్టోబరు మధ్యలో 884 కోట్ల నోట్లు డిస్పోజ్ అయ్యాయి. ఇంత భారీగానా అంటే.. అవుననే చెప్పాలి. ఎందుకంటే కరెన్సీని ఇష్టారాజ్యంగా (మడతపెట్టటం.. చేతిలో నొక్కి పెట్టుకోవటం.. చేతులు మురికిగా ఉన్నా పట్టుకోవటం.. ఇష్టం వచ్చినట్లుగా మడతపెట్టి జేబుల్లో.. పర్సుల్లో దూర్చటం తరహాలో) వాడటం.. అజాగ్రత్తగా ఉండటంతో కరెన్సీ నోట్లు త్వరగా పాడవుతున్నాయి.
కరెన్సీ నోట్ల విషయంలో ప్రదర్శించే నిర్లక్ష్యం కారణంగా.. నోట్లు త్వరగా పాడవుతున్నాయి. ఇలా ఏడాదికి 15వేల టన్నుల బ్రిక్వెట్స్ (పాడైన నోట్లను కుదించి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇటుకల మాదిరి చేయటం)ను డిస్పోజ్ చేస్తున్నారు. ఆర్ బీఐ డిస్పోజ్ చేసే నోట్లల్లో అత్యధికం రూ.500 నోట్లు ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నోట్లు 898కోట్లుగా ఉంటే.. తర్వాతి స్థానంలో వంద నోట్లు ఉన్నాయి. ఇవి 583 కోట్ల నోట్లను డిస్పోజ్ చేశారు. అదే సమయంలో రూ.20, రూ.10నోట్లను డిస్పోజ్ చేయటం భారీగా తగ్గింది. దీనికి కారణం చిన్ననోట్ల వినియోగం తగ్గి.. యూపీఐ పేమెంట్లు భారీగా జరగటమే.
డిజిటల్ పరంగా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నప్పటికీ.. మన దేశంలో కరెన్సీ నోట్ల వాడకం ఏ మాత్రం తగ్గటం లేదంటున్నారు. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి కొత్తగా వచ్చి చేరిన నోట్ల సంఖ్య 2260 కోట్ల నుంచి 3030 కోట్లకు పెరగటమే దీనికి నిదర్శనం. అంటే.. ఏకంగా 34 శాతం పెరిగాయి. మొత్తంగా కరెన్సీ నోట్ల వినియోగం పెరగటమే కాదు.. వాటిని మొయింటైన్ చేయటంలో నిర్లక్ష్యం కూడా ఎక్కువే కావటం గమనార్హం.